Nov 29,2022 23:09

ప్రజాశక్తి-విజయవాడ: కార్మికోద్యమ నాయకులు నండూరి ప్రసాదరావు స్ఫూర్తితో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని సిఐటియు సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్షులు కె దుర్గారావు పిలుపునిచ్చారు. నండూరి ప్రసాదరావు 21వ వర్ధంతి బిఆర్‌టిఎస్‌ రోడ్డులోని నండూరి ప్రసాదరావు భవన్‌లో మంగళవారం జరిగింది. ముందుగా నండూరు ప్రసాదరావు చిత్రపటానికి సిఐటియు సీనియర్‌ నాయకులు టి.ప్రభుదాస్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానుద్దేశించి దుర్గారావు మాట్లాడుతూ కార్మికోద్యమ నాయకులు నండూరి ప్రసాదరావు తన జీవితం మొత్తాన్ని కార్మికులు, శ్రమ జీవుల ప్రయోజనాల కోసం పోరాటాలు నిర్వహించిన మహా నాయకులు అని కొనియాడారు. అందరికీ ఆదర్శంగా ఉంటూ చాలా ఆప్యాయతగా కార్యకర్తలను పలకరిస్తూ ఉత్సాహ పరిచే వారిని గుర్తు చేశారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడి కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్‌ సిటీ ఆఫీస్‌ బేరర్స్‌ వై సుబ్బారావు, ఎం బాబురావు, బి గోవింద్‌, సిహెచ్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.