
నందనవనంలా నారపురెడ్డి కుంట చెంచుగూడెం
- తీర్చిదిద్దుతున్న గ్రామీణ నూతనీకరణ సంస్థ (విఆర్‌ఒ)
- 60 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం
- ఆదివాసి చెంచు కుటుంబాల్లో ఆనందం
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్
ఆధునిక సమాజానికి దూరంగా నల్లమల అడవిలో కనీస మౌలిక సదుపాయాలు పక్క గృహాలు, తాగునీరు, విద్య, వైద్యంకు నోచుకోక అనాగరికంగా బతుకుతున్న నారపరెడ్డి కుంట చెంచుగూడెంను విఆర్‌ఒ (గ్రామీణ నూతనీకరణ) స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు వంగల ఏక నరసింహారెడ్డి హుండారు మోటార్స్ ఇండియా లిమిటెడ్, ఐటిడిఎ, ఎపిఎంఐసి ప్రభుత్వ అధికారుల సహకారంతో చెంచుల జీవితాలలో నూతన వెలుగు రేఖలు నింపుతున్నారు. చెంచు కుటుంబాలతోనే మమేకమై పండ్లతోటల పెంపకాన్ని ప్రారంభించారు.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం చిన్న దేవలాపురం మజరా గ్రామం అతి ప్రాచీన చెంచుగూడెం నారపరెడ్డి కుంట గూడెంలో తరతరాల నుండి దాదాపు 60 నుండి 70 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమల అటవీ ప్రాంతాన్ని గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించడంతో వారి జీవనం అగమ్యగోచరంగా తయారయింది. ఈ పరిస్థితుల్లో చెంచు కుటుంబాలకు విఆర్‌ఒ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగల ఏక నరసింహారెడ్డి అండగా నిలిచారు. ఉన్నత విద్యను అభ్యసించిన నరసింహారెడ్డి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చెంచుల జీవన స్థితిగతులపై పిహెచ్‌డి చేసి డాక్టరేట్ పొందారు. ఆయన నారపురెడ్డి కుంట చెంచులతో కలిసి వారికి ప్రభుత్వం ఇచ్చిన భూములను పరిశీలించారు. 50 కుటుంబాలకు గాను 31 మంది రైతులకు 60 ఎకరాలు కేటాయించారు. ఈ భూములు సాగుకు నోచుకోక బీడుగా మారాయి. నరసింహ రెడ్డి రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులతో సమన్వయం చేసుకుని భూముల్లో ఉన్న కంప చెట్లు తొలగించి జంగిల్ క్లియరెన్స్ చేశారు. ల్యాండ్ లెవెలింగ్ చేసి సాగుకు యోగ్యంగా తయారు చేశారు. వెంటనే పొలంలో మామిడి, జామ, నిమ్మ పండ్ల మొక్కలను నాటేందుకు చెంచులతో పాదులు తీయించారు. 60 ఎకరాల భూమిలో 6700 మొక్కలను నాటించారు. మొదట ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీళ్లు పోసి బతికించారు. ఎకరానికి 110 మొక్కలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుని, మధ్యన అంతర్ పంటలు వేయడానికి వీలుగా పండ్ల మొక్కలు నాటించారు. అనంతరం ఆరు బోర్ల ద్వారా సూక్ష్మ బిందు సేద్యం ద్వారా పైప్ లైన్లు బిగించి ప్రతి మొక్కకు నీరు అందేలా డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఏర్పాటు చేయించారు. పండ్ల తోటల రక్షణ కోసం నారపురెడ్డి కుంట గూడెం చుట్టూ చైన్ లింక్ మెస్ దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిర్మించి అడవి జంతువుల నుండి రక్షణ కవచం ఏర్పాటు చేశారు. ఐదు సంవత్సరాలు ఈ పండ్ల మొక్కలను కాపాడితే ఫల సాయం వస్తుందని, దాని ద్వారా చెంచు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
ఫలసాయం మార్కెట్ కోసం అగ్రికల్చర్ సెంటర్
పండ్ల తోటల నుంచి వచ్చే ఫలసాయాన్ని మార్కెటింగ్ చేసేందుకు వీలుగా రూ.11 లక్షల 75 వేలతో గోదాం నిర్మించారు. ఈ సెంటర్‌లో నిల్వ చేసుకోవడం, గ్రేడింగ్, మార్కెటింగ్ చేసుకోవచ్చు. దళారీల మోసం లేకుండా డైరెక్ట్‌గా మార్కెటింగ్‌కు పంపేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
చెంచు ఆదివాసీల అభివృద్ధే సంస్థ ధ్యేయం
ఆదివాసి చెంచు కుటుంబాల అభివృద్ధే విఆర్‌ఒ సంస్థ ప్రధాన ధ్యేయం. అభివృద్ధికి చెంచులు పనికిరారనే మాటకు అర్థం లేదని, వారితోనే వ్యవసాయం చేయించి ఫలసాయం పొందేందుకు కృషి చేస్తాను. ఆత్మకూరు మండలంలోని బైర్లూటి, నాగలూటి, ఇందిరేశ్వరం, మహానంది మండలంలో చెంచులక్ష్మి గూడెం చెంచుల అభివృద్ధికి కృషి చేశాం.
విఇ నరసింహారెడ్డి, గ్రామీణ నూతనకరణ సంస్థ అధ్యక్షుడు.
నరసింహారెడ్డి దొర సాయం మరువలేం
దశాబ్దాల కాలం నుండి ఆదివాసి చెంచులను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఎవరు రాలేదు. విఆర్వో సంస్థ అధ్యక్షుడు నరసింహారెడ్డి మా జీవితాలలో వెలుగు నింపే సూర్యుడిలా మాకు దొరకడం మా అదృష్టం. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా తెలుగుగంగ ప్రధాన కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నారపురెడ్డి కుంట చెరువుకు సాగునీరు అందించి ఆదుకోవాలి.
జల్లి సుంకన్న, మాజీ విడిసి, నారపరెడ్డి కుంట చెంచుగూడెం.
విఆర్‌ఒ సంస్థకు కృతజ్ఞతలు
ఆదివాసి చెంచు కుటుంబాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న విఆర్‌ఒ సంస్థ అధ్యక్షుడు నరసింహారెడ్డికి నారపురెడ్డి కుంట చెంచు గూడెం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గూడెంలోని కుటుంబాలు మొత్తం ఆయన చూపిన బాటలోనే పయనిస్తాం.
సంగు ఈదన్న, చెంచు యువకుడు, నారపరెడ్డి కుంట చెంచుగూడెం.










