
ప్రజాశక్తి - నందిగామ : నందిగామ పట్టణంలో షాదీ ఖానా నిర్మాణం అభివద్ధికి నోచుకోవడం లేదు. నందిగామ పట్టణంలో సుమారు 12 వేలకు పైగా ముస్లిం మైనార్టీలున్నారు. రెండు దశాబ్దాల కిందట గత ప్రభుత్వంలో ఈద్గా స్థలంలో షాదిఖానా నిర్మించారు. నందిగామ పట్టణానికి దూరంగా ఉందని షాదిఖానా వినియోగించుకోలేదు. షాదిఖానాకు వాడిన రేకులు, ఇనుప సామాగ్రి పూర్తిగా పాడైపోయాయి. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని వైపు ఎవరు చూడలేదు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉంది. పిచ్చిమొక్కలు పెరిగి శిథిలావస్థలో ఉన్న షాదిఖానా కూల్చి వేశారు. ముస్లింలు శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌ను ఆశ్రయిస్తున్నారు. అద్దెలు అధికంగా ఉండటంతో భరించలేకపోతున్నారు. చేసేది లేక కొందరు రహదారులపై ఖాళీ స్థలాలపై ఫంక్షన్లు నిర్వహించుకుంటున్నారు. నందిగామలో షాదిఖానా నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేస్తామని రెండేళ్ల కిందట మంత్రి అంజద్ పాషా హామీ ఇచ్చారు. నందిగామ వచ్చినప్పుడు మంత్రి ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ షాదీఖానా పరిశీలించి నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నూతన నిర్మాణం ప్రారంభించేందుకు షాది ఖానా భవనాన్ని తొలగించి ఏడాది దాటినా నిధులు మంజూరు కాలేదు. అధికారులు స్థలాన్ని పరిశీలించారు. మొదట కోటి 30 లక్షలు అంచనాలు తయారు చేశారు. తర్వాత రెండు కోట్ల 80 లక్షలకు అంచనాలు పెంచారు. నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేశారు. కాలం గడుస్తున్నా అంచనాలు కార్యరూపం దాల్చలేదని, ఇప్పటికైనా షాదిఖానా నిర్మించాలని నందిగామ ముస్లిం, మైనార్టీ సోదరులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
షాదీ ఖానా భవనం తక్షణమే నిర్మించాలి
: హస్సేన్ సిపిఎం నాయకులు
నందిగామలో ముస్లింలకు షాదీఖానా లేక వివాహాలు చేసుకోవటానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఫంక్షన్ హలుకు అద్దెలు భరించలేక పేద వారు అవస్థలు పడుతున్నారు.