గోపాలపురం అనే ఊరిలో గోపయ్య అనే పాలవ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర పూటకి ఐదు లీటర్ల చొప్పున పాలు ఇచ్చే పరిపుష్టమైన నాలుగు ఆవులు ఉండేవి. ఆ పాలను అమ్ముకుంటూ గోపయ్య తన భార్యాబిడ్డలను పోషించుకునేవాడు. ఒకరోజు గోపయ్య అత్యవసర పనిమీద రెండురోజులు పొరుగూరు వెళ్లాల్సి వచ్చింది. దాంతో తోటి ఆవుల కాపరి రంగయ్యను తన ఆవులను మేతకి తీసికెళ్లమని కోరాడు. ఆ మాటకి 'అదెంత భాగ్యం! దీనిలో అంత శ్రమ ఏముంది? అలాగే నీవు నిర్భయంగా వెళ్లిరా!' అంటూ అంగీకరించాడు రంగయ్య. రెండవరోజు సాయంకాలానికి కంగారుపడుతూ గోపయ్య ఇంటికి మూడు ఆవులతో చేరాడు రంగయ్య. అప్పుడే ఊరి నుండి ఇంటికి చేరుకున్న గోపయ్యతో రంగయ్య 'నన్ను క్షమించు, నా అజాగ్రత్త వల్ల నీ ఆవు ఒకటి తప్పిపోయింది. ఎంత వెదికినా దొరకలేదు' అని దుఃఖిస్తూ చెప్పాడు. ఆవు కనబడలేదనే బాధకన్నా ఏడాది వయసున్న దాని దూడ తల్లి కోసం వెదుకుతూ ''అంబా!'' అనే అరుపు గోపయ్యని తీవ్రంగా కలచి వేసింది.
మూడు మాసాలు గడిచినా ఆవు జాడ లేదు. దూడ సరిగ్గా మేత తినక, నీళ్ళు తాగక తల్లి మీద బెంగతో బక్కచిక్కింది. దాని బాధ చూడలేక సంతలో అమ్మడానికి తీసుకెళ్ళాడు గోపయ్య. పశువుల సంత ఎంతో రద్దీగా ఉంది. గోపయ్య దూడని కిక్కిరిసిన జనం మధ్య నుండి బలవంతంగా తీసుకెళ్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక్కసారిగా ''అంబా! అంబా!'' అంటూ గట్టిగా అరుస్తూ ఒక ఆవు గోపయ్య వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. దూడ గోపయ్య చేతి నుండి బలంగా తాడు లాక్కొని, ఆ ఆవుని చేరింది. ఆ రెండూ ఒకదాని మీద ఒకటి తనివి తీరా ఎనలేని ఆప్యాయతని స్పర్శించుకున్నాయి.
ఇంతలో తన కంటే ఒక మూర ఎత్తు ఉన్న చేతి కర్ర పట్టుకున్న వ్యక్తి బలంగా దూడ నుండి ఆవుని లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. ఇదంతా గమనిస్తున్న గోపయ్య అతనికి అడ్డంగా నిలబడి 'ఈ ఆవు నీకు ఎక్కడ దొరికింది? ఈ ఆవు నాది' అని గట్టిగా గదమాయించాడు. ముందు కాసేపు ఆ ఆవు తనదే అని నమ్మించడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడతను. చివరకు ఆవు, దూడల అన్యోన్యతని కళ్లారా చూశాక నిజం చెప్పి, ఆవుని గోపయ్యకి అప్పగించి, తిరుగుముఖం పట్టాడు. 'ఆవు దొరకడంతో తన బాధ, దూడ దిగులు తొలిగిపోయాయి!' అనుకుంటూ వాటిని తీసుకుని, ఇంటికి చేరాడు గోపయ్య.
కొన్నాళ్ళకు రంగయ్యకి జబ్బు చేసింది. పెద్ద ఆపరేషన్ చేయడం వల్ల కొన్నిరోజులు మంచం దిగకూడదని వైద్యులు చెప్పారు. దాంతో అతని ఆవులు మేతలేక ఆకలితో అలమటిస్తున్నాయని తెలిసి, తన ఆవుల కోసం తెచ్చిన మేతలో సగభాగం వాటికి వేసేవాడు గోపయ్య.
ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత ఒకరోజు సాయంత్రం గోపయ్య ఇంటికి వచ్చాడు రంగయ్య. 'నీవు నన్ను నమ్మి, ఆవులను అప్పజెప్పావు. నేను నీకు నమ్మకద్రోహం చేశాను. నా ఆవుల కంటే నీ ఆవులు అధికంగా పాలు ఇస్తున్నాయనే దుర్భుద్దితో నీ ఆవుని అమ్మేశాను. ఇది తెలిసినా గొప్ప మనస్సుతో నా ఆవుల ఆకలి తీర్చావు. నన్ను క్షమించు!' అంటూ ప్రాధేయపడ్డాడు రంగయ్య.
'ఇప్పటికైనా నీవు చేసిన తప్పు తెలుసుకున్నావు.. నాకు అదే చాలు!' అంటూ గోపయ్య అతన్ని క్షమించేశాడు.
* పల్లపోతు ఆంజనేయస్వామి, 9949642293