
'అమ్మా నిక్కీ నాతో ఆడడంట, డింపూనీ ఆడొద్దన్నాడు' ఐదేళ్ల చిన్నూ కళ్లనీళ్లు కారుతుండగా ఉక్రోషంగా అన్నాడు.
చదువుతున్న న్యూస్‌పేపర్ పక్కన పడేసి, చిన్నూ రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకుని, తన ముందు కూర్చోబెట్టుకుంటూ, 'ఎందుకు ఆడనన్నాడు? మీ ఇద్దరూ పోట్లాడుకున్నారా?' అడిగింది ఉష.
'నేనేం పోట్లాడలే. వాడే, నువ్వు నల్లగా ఉన్నావు. నీతో ఆడుకోను.. డింపూనీ ఆడొద్దన్నాడు. అదీ మానేసింది ఆడటం' ఏడుపు మధ్య ఆగి ఆగి జరిగింది మొత్తం చెప్పాడు.
అంతా విన్న ఉషకి. 'చిన్నూకి అప్పుడే రంగు వివక్ష మొదలైందా?' అని బాధ కలిగింది. కానీ చిన్నూతో మామూలుగానే, 'నిక్కీ, డింపూ సాయంత్రానికి వస్తారులే. అందరూ కలిసి పార్క్‌లో ఆడకుందురుగానీ' కన్నీళ్లు తుడుస్తూ అంది ఉష.
***
ఏమి జరిగిందంటే.. నిక్కీ తల్లి ఆశ బయటకి వెళ్లింది. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని మంగ టీవీలో పడింది. చిన్నూ, నిక్కీ, డింపు, ఆశ మేకప్ కిట్‌తో ప్రయోగాలు చేశారు. ఆటల్లో అద్దం ముందు నుంచుని రకరకాల మొహాలు పెడుతూ నవ్వుకుంటున్నారు. అద్దంలో నల్లగా కనిపించిన చిన్నూ మొహం నిక్కీకి నచ్చలేదు.
ఆశ వాళ్లింట్లో అందరూ తెల్లగా ఉంటారు. ఆశ, ఆమె భర్త ఫ్యాషనబుల్‌గా ఉండటమే విలువ అని అనుకోడమే కాకుండా ఇంటి, ఒంటి అలంకరణలో అభిరుచి కన్నా ప్రస్తుత ట్రెండ్స్ ముఖ్యంగా భావిస్తారు. ఫ్రిజ్ నిండా ప్రకటనల్లో కనిపించే రకరకాల తినే, తాగే పదార్థాలు, డ్రెస్సింగ్ టేబుల్ ముందు రకరకాల క్రీములు, లోషన్లు. స్టేటస్ సింబల్‌గా ఇంట్లో పనిపిల్ల మంగ. భార్యాభర్తలు తరచూ పిల్లల్ని మంగకి అప్పగించి షాపింగ్, సోషల్ నెట్ వర్కింగ్, పార్టీల్లో ఎక్కువ సమయం గడుపుతారు.
ఇంట్లో తెల్లని తెలుపే 'గౌరవప్రదమైన రంగు' అన్న వాతావరణం. దీనికి తోడు భార్యాభర్తలిద్దరూ ప్రతి ఒక్కళ్లకీ ఏదో ఒకపేరు పెట్టి, ఎగతాళి చేస్తారు. మంగని అయిన దానికీ, కానిదానికీ విసుక్కోడం పిల్లలు ఎప్పుడూ వినే మాటలు. నిక్కీకి వాళ్ల నాన్నలాగే మాటల మధ్య 'నీయమ్మ, నీయబ్బ' ఆశువుగా వచ్చేస్తాయి.
'నువ్వు తెల్లగా ఉన్నావు, నేనెందుకు నీలా లేను?' చిన్నూ ఏడుస్తూ ఉషని కావలించుకున్నాడు. 'నేను నీలాగే తెల్లగా అవ్వాలి' ఉష చెంపలు పట్టుకుని అన్నాడు.
చిన్నూని అలానే గుండెలకి అదుముకుని, ఆప్యాయంగా వీపు నిమురుతూ చిన్నూ నెమ్మదించాక ఒళ్లో వేసుకుంది. 'మొహం నిండా ఈ రంగులేంట్రా? జోకర్‌గాడిలా!' ముక్కు పట్టుకుని అటూ ఇటూ అని, కుర్చీ మీదున్న చున్నీలాగి బుగ్గలకి పూసుకున్న లిప్‌స్టిక్‌ని, పౌడర్‌ని తుడిచింది.
ఉష చిన్నూ రెండు బుగ్గలు నిమురుతూ, ముద్దు పెట్టుకుని, 'అమ్మకి చిన్నూ అంటే ప్రేమ. చిన్నూకి అమ్మంటే ప్రేమ. అమ్మకి, చిన్నూకి ఎవరంటే ప్రేమ?' అని అంది. చిన్నూకి అమ్మ, నాన్న తనతో ఆడే ఆట గుర్తొచ్చి, మొహంలో నవ్వు విరిసింది.
***
రవిని ఉష మొదటిసారిగా రాజమండ్రిలోని ఒక ఎన్‌జిఓ సంస్థ ఏర్పాటుచేసిన కోచింగ్ సెంటరులో కలిసింది. పల్లెటూర్లలో డిగ్రీ పూర్తిచేసుకున్న ప్రతిభావంతులను ఎంచి, ఉద్యోగ పరీక్షలకు శిక్షణనిచ్చారు.
అబ్బాయిలు, అమ్మాయిలు మొదటిసారిగా తమ వయసు కొత్తవాళ్లని కలవటం, ఊరి కట్టుబాట్లు, అమ్మానాన్న లు, ఎప్పుడూ కాపలా కాసే టీచర్లు లేకపోవటంతో వింత స్వేచ్ఛలో కొంత బిడియంగా ఉన్నా, లెక్కలేనట్టుగా నటిస్తూ తమకు అంతా మామూలుగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కొందరు అబ్బాయిలు గుంపులుగా చేరి, సినిమాలు, తమ హీరోల గురించి మాట్లాడుతూ అమ్మాయిలని గమనిస్తు న్నారు. తమని ఎవరైనా చూస్తున్నారా, లేదా అని అమ్మాయిలు ఇద్దరు, ముగ్గురుగా పనున్నా లేకున్నా హడావిడిగా తిరుగుతున్నారు.
'బాబుమోహన్‌ని చెంప మీద కొట్టటం జోక్ ఎట్లా అవుతుంది, రాంకీ ?' పదునైన కంఠంలోంచి, స్పష్టంగా వచ్చింది.
'ఏం, ఎందుకు కాదు?'
'మనలో మనం చెంపలు పగలకొట్టుకున్నాంరా ఎప్పుడైనా, జోక్ అని?' అనడంతో.. ఆసక్తిగా మంచినీళ్ల బాటిల్ నింపుతున్న ఉష అటువైపు చూసింది.
'మనం చేసేవే సినిమాల్లో చూపిస్తే మనకు నవ్వెలా వస్తుందిరా? వికారంగా ఉన్న వాడిని కొడితే నవ్వొస్తుంది కదరా!'.
'కొట్టటం, తన్నటం జోకే అవదు. మన తెలుగు మాస్టారు నాగేశ్వరావుగారు ఎంత లావుగా ఉండేవారు! ఆయన కథలకి ఎంత నవ్వేవాళ్లం! ఆయన లావని మనం నవ్వేవాళ్లం రా?'
ఆ అబ్బాయి లాజిక్‌కు అందరూ అంగీకారంగా తలూపారు.. రాంకీ తప్ప.
'పొట్టి శీనుగాడు గుర్తున్నాడురా? గొంతులు మార్చి, మనందర్నీ అనుకరించి ఎంత నవ్వించేవాడు. వాడు మనందరి కన్నా ఎంత పాపులర్! వాడిని చూసి మనం నవ్వటమా!'
'ఒరేరు, సినిమాని సినిమాగా చూడాలిరా, ఎంజారు చేయరా, అదేమన్నా నిజమా?' అన్నాడు రాంకీ.
ఇంకా సమర్ధించుకుంటున్న రాంకీ వీపు మీద అరచేయి డొలుపుగా చప్పిడి దెబ్బ పెద్ద సౌండ్ వచ్చేలా కొట్టాడు ఆ అబ్బాయి.
చుట్టూ ఉన్న నలుగురూ రాంకీని చరచటానికి చెయ్యెత్తారు. రాంకీ వీళ్లకి దొరకకుండా తప్పుకున్నాడు పెద్దగా నవ్వేస్తూ.
ఉషకీ నవ్వొచ్చింది. ఆ వాదన నచ్చింది. బాడీ షేమింగ్ జోకులు తనకి నచ్చకపోయినా అందరూ నవ్వుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో ఉషకి తెలిసేది కాదు. చక్కగా మాట్లాడిన ఆ అబ్బాయి వైపే ఆసక్తిగా చూసింది. ముఖంలో ఒక కాంతి, కళ్లలో మెరుపు, నవ్వడానికి సిద్ధంగా ఉన్న పెదవులు. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా, కొత్త అనిపించని మృదువైన ముఖ కవళికలు, చూస్తే చాలు అప్రయత్నంగా పలకరించాలనిపించే ముఖం.
ఉష అలా అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ అబ్బాయి తనని చూసి, పలకరింపుగా నవ్వి తనవైపే వస్తుంటే, ఒక్క క్షణం 'ఏంటి ఈ అబ్బాయి దూకుడు?' అనుకుంది.. కానీ సంతోషంగానే ఫీలయ్యింది.
'ఏంటి భవాని నువ్వు ఎప్పుడు వచ్చావు?' అని తన పక్కనే నింపిన నీళ్ల బాటిల్ పట్టుకుని, నించుని వాళ్ల మాటలు ఫాలో అవుతున్న తన ఫ్రెండ్‌ని పలరించాడు.
భవానీని చూసి నవ్విందని అర్థమైన ఉష తనలో తాను ఉడుక్కుని, 'దీనికి ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాడని ఎప్పుడూ చెప్పనేలేదు, దెయ్యం' అనుకుంది.
ఇంతలో భవాని 'ఉషా, ఇతను రవి. నందంపూడి వీళ్లది. మా కజిన్ రాజేష్, రవి మంచి ఫ్రెండ్స్ కాలేజీలో. ఈయన పెద్ద స్కాలర్‌షిప్ హోల్డర్ తెలుసా? చాలా క్లవర్' తనకి రవి గురించి చాలా తెలుసన్నట్టు పరిచయం చేసింది.
'రవీ, ఈవిడగారు ఉష, నా క్లాస్‌మేట్, మా క్లాస్ ఫస్ట్, యమ సిన్సియర్ స్టూడెంట్.' గబా గబా చెప్పింది నవ్వుతూ.
'నోరుముయ్యవే', భవాని చేతి మీద ఒక్క దెబ్బ వేసి, 'దీని వాగుడు నమ్మకండి' అంది రవితో, తిరిగి కొట్టడానికి ఎత్తిన భవాని చేతికి దొరక్కుండా తప్పుకుంటూ.
'నా గురించి నిజమే చెప్పిందే!' అల్లరిగా నవ్వుతూ అన్నాడు రవి. ముగ్గురూ కబుర్లలో పడ్డారు. మాటల్లో తను ఐఏఎస్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు.
రవి కబుర్ల పుట్ట. చెట్టు, పువ్వు గురించి మొదలుకుని రాజకీయాల, గొప్ప వ్యక్తుల గొప్పతనమే కాకుండా.. వాళ్లు మామూలు మనుషులుగా చేసే తప్పుల గురించి అవగాహన తో మాట్లాడే రవి ఉషకి ప్రపంచాన్ని చూడటానికి చాలా కిటికీలు తెరిచాడు.
క్లాసులో ఎక్కువగా ప్రశ్నలు అడిగేది ఉష. ఆమెలో కొత్త విషయాలు నేర్చుకునే శ్రద్ధ రవిని బాగా ఆకట్టుకుంది. 'పాఠాల్లో, పుస్తకాల్లో సమాజం గురించి, హాయిగా బ్రతకటం గురించి చెప్పే విషయాలు అందరూ తెలుసుకొని ఎవరు, ఎవర్ని ఇబ్బందిపెట్టకుండా ఉంటే అందరూ ఇంకా ఆనందంగా ఉంటారు కదా' అని విస్టఫుల్‌గా మాట్లాడే ఆమె అమాయకత్వం, మంచితనం అపురూపంగా ఉండేది రవికి.
ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ముందు నిలబడేది ఉష. కట్టులో, బొట్టులో 'ఆడపిల్ల'లాగా, నెమ్మదిగా కనిపించే ఉష అబ్బాయిలతో సమాన స్థాయిలో మాట్లాడేది. తన అభిప్రాయాలు కచ్చితంగా చెప్పే ఉష అంటే రెండు మూడు రోజుల్లోనే అబ్బాయిల్లో ఒక గౌరవం, భయం కలిగాయి.
నాలుగు వారాల శిక్షణ ఇట్టే అయిపోయినట్లు అనిపించింది. తరువాత రవి ఎమ్మెస్సీలో, ఉష ఎమ్‌ఏ ఇంగ్లీష్ సాహిత్యంలో చేరారు. ఒకళ్ల గురించి, మరొకళ్లకి కామన్ ఫ్రెండ్స్ ద్వారా విషయాలు తెలియడం తప్ప వారిద్దరూ పెద్దగా కలవలేదు. అయినా ఒకరి ప్రభావం ఒకరి మీద బాగానే పడింది. 'ఉష పట్టుదల తనకుంటేనా' అనిపించేది రవికి. ఉష మృదుత్వం, స్థిరత్వం గుర్తొచ్చి ఒక కొత్త నిండుతనం ఫీలయ్యేవాడు రవి. తనకి తోడుగా ఉష ఉంటే అని ఆలోచన వచ్చినా ఇది సమయం కాదులే అని పక్కకు పెట్టేసేవాడు.
రవి మాటలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఉషకి జీవితంలో ఒక కొత్త కోణం చూపించాయి. సాహిత్యం ఉషని ఉక్కిరి బిక్కిరి చేసి, గందరగోళపరిచినా ఆమె ఆలోచనలకి కొత్తబలం తెచ్చిపెట్టాయి. ఆకర్షణీయంగా కనిపించే వారిని అనుకోకుండానే రవితో పోల్చుకునేది.
పిజి అయిన వెంటనే తన ఐఏఎస్ కల పక్కన పెట్టి, డిఫెన్సులో ఉద్యోగం తెచ్చుకుని మరీ ఉష చెయ్యి అడిగాడు రవి. రోజులు నెలలు అయిపోటం, చిన్నూ తమ జీవితంలోకి రావటం కాలానికి రెక్కలొచ్చినట్లయింది ఇద్దరికీ.
రవి నోట్లోంచి ఊడిపడిన చిన్నూగాడి మెరిసిపోయే కళ్లు, అల్లరిగా నవ్వే పెదవులు చూస్తే ఉషకి చెప్పలేనంత సంతృప్తి.
నోట్లోంచి మాట రావటంతోనే నేర్చేసుకుని, ఇంకా ఏమిచెపుతావు అన్నట్టుండే చిన్నూని చూస్తే ఉషే పసిపిల్లయ్యి, తన ఒళ్లో కూర్చుందా అనిపిస్తుంది రవికి.
కథలు, కబుర్లు, ఆటలతో కామాలే తప్ప ఫుల్‌స్టాప్ ఉండదు చిన్నూగాడి టైం కి. రాత్రి, పగలు లేని వాడి ఆటకు ఫుల్‌స్టాప్ ఒక్కటే.
ఉష రవి మెడ చుట్టూ చేతులు వేసి, బుగ్గమీద ముద్దు పెట్టుకుని 'అమ్మకి నాన్నంటే పేవఅ' అంటుంది. 'ర' పలకలేని, 'మ' ని తమాషాగా 'వ' కి 'అ' కి మధ్యలో అనే చిన్నూని అనుకరిస్తూ. 'ప్రేమ' అనటానికి వాడి తిప్పలకి ముద్దుగా మురిసిపోతూ.
రవి, ఉష నడుం మీద చేయివేసి దగ్గరకు లాక్కుని 'నాన్నకి అమ్మంటే పేవఅ' అని ఉష బుగ్గమీద ముద్దు పెట్టుకుంటాడు.
ఇద్దరూ నవ్వుకుని ఒకళ్లనొకళ్లు గట్టిగా పట్టుకుంటారు. చిన్నూగాడు వెంటనే ఆడుతున్న ఆట వదిలేసి, వాళ్ల ఇద్దరి మధ్యకూ దూరే ప్రయత్నం చేస్తాడు.
'రవీ, చిన్నూని మన మధ్యకు రానీయకు' అంటుంది ఉష నవ్వుతూ.
చిన్నుగాడి ఉక్రోషం మొహం చూసి, రవి పక పక నవ్వుతూ 'అసలు రానీను, ఉషా, రా, మనిద్దరమే బజ్జుందాం' అని ఉషని ఇంకాస్త దగ్గరగా లాక్కుంటాడు.
'ఊహు...ఊహు.' అంటూ ఇద్దరి మధ్య దూరాలని ప్రయత్నం చేస్తాడు చిన్నూ.
ఇద్దరి మధ్యకి రానివ్వటం లేదని ఉక్రోషంతో కొట్టబోయే చిన్నూని, ఒడుపుగా పట్టేసి, కితకితలు పెట్టేవాళ్లు రవి, ఉష.
నవ్వి, నవ్వి, పెనుగులాడి, అలసిపోయి, చివరకి ఇద్దరి మధ్య చేరి, ఒక కాలు అమ్మ మీద, మరొకటి నాన్న మీద వేసి, ఇద్దరినీ తనకే క్లయిమ్ చేసుకుని సంతృప్తిపడుతుంటే, ఉష 'అమ్మకి నాన్నంటే పేవఅ' అంటుంది.
రవి 'నాన్నకి అమ్మంటే పేవఅ' అంటాడు. చిన్నూ బుంగమూతి పెడతాడు.
అది చూసి ఇద్దరూ పకపకా నవ్వేసి, వాడి రెండు బుగ్గల మీద ముద్దుపెట్టి 'అమ్మకి, నాన్నకి చిన్నూ అంటే పేవఅ' అంటారు.
ఆటల్లో, పాటల్లో రోజులు గడిచి పోతుంటే స్కూల్లో చేరిన రెండో ఏడాది నుండి చిన్నూకి తాను నలుపు అని తెలిసి వచ్చింది. వాడు నలుపు గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఉష. పట్టించుకోకపోవటం ద్వారా వాడు దానికి విలువ ఇవ్వడనే ఉద్దేశంతో. వాడూ ఈజీగానే మరొక విషయానికి వెళ్లిపోయాడు.
కానీ, ఒక రోజు స్కూల్ నుండి వచ్చి 'అమ్మా, నువ్వు స్వీటీలాగా తెల్లగా అందంగా ఉన్నావు. నేను, నాన్న నల్లగా ఉన్నాము.' ఒక రకమైన బరువుగా అన్నాడు.
పసివాడు ఇంత కష్టపెట్టుకున్నట్లుగా మాట్లాడం ఉష మొదటిసారిగా చూసింది. వాడి అమాయక ముఖం మనసంతా మెలిపెట్టింది.
ఈ 'అందం' అనే భావన వాడి పసి జీవితంలోకి ఇంత త్వరగా వస్తుందనుకోలేదు ఉష.
ఏమి సమాధానం చెప్పాలో అర్థంకాక ఇంతలోనే తేరుకుని 'అందం అంటే హాయిగా నవ్వటం. నేను కోపంగా ఉంటే నీకు బాగుంటుందా?' కోపంగా మొహం పెట్టి సీరియస్‌గా చిన్నూ కేసి చూసింది. వెంటనే నవ్వుతూ వాడి చేతులు పట్టుకుని ఉయ్యాలా ఊపుతూ, 'ఏది బాగుందో చెప్పు!' అన్నట్టుగా వాడికేసి చూసింది.
అమ్మ సడెన్‌గా పెట్టిన కోపం మొహం చూసి గతుక్కుమని, చేతులు పట్టుకొని నవ్వితే, అమ్మ చేసిన పని అర్థమై చిన్నూ అమ్మ చేతులు ఊపుతూ, నవ్వుతూ 'నవ్వితేనే బాగున్నావ్' అన్నాడు.
వాడిని అలానే ఎత్తుకొని అద్దం ముందుకు తీసుకెళ్లి అద్దంలో చిన్నూగాడు ఎలా ఉన్నాడు?' అంది.
'అందంగా ఉన్నాడు' అన్నారు ఇద్దరూ.
అమ్మ ఆట, మాటలతో హాయిగా ఫీలై.. బొమ్మల పుస్తకాలు ముందేసుకుని, ఎవరి మొహాలు ఎలా ఉన్నాయో చూస్తూ, మధ్య మధ్యలో అద్దంలో తనని తాను చూసుకుంటున్నాడు, మొహం రకరకాలుగా మారుస్తూ.
వాడు బొమ్మల పుస్తకంలో మునిగిపోయినా ఉష మనసు తేరుకోలేదు. ఈ నలుపు తాను చెప్పినంత తేలిక విషయం కాదని, చెయ్యాల్సింది చాలా ఉందనిపించింది.
అదే ఆలోచిస్తూ పనులు చేసుకుంటూ ఉన్న ఉష దగ్గరకి 'అమ్మా, చూడు, చిన్ని కృష్ణుడు ఎంత నల్లగా ఉన్నాడో. నాలాగే ఉన్నాడు కదా.' వాడి డిస్కవరీ బాధ, సంతోషం కలిగించాయి. ఉష కూడా ఉత్సాహంగా, 'హేరు, అవును రా, చిన్నికృష్ణుడు నీలాగే ఉన్నాడు. పాము పైకి ఎక్కి డాన్స్ చేస్తూ, ఎంత ముద్దుగా ఉన్నాడో కదా!' అంది.
'ఆగు, నీ చిన్నప్పుడు కృష్ణుడులాగా పింఛం పెట్టి, పంచె కట్టి, పిల్లనగ్రోవితో ఫోటో తీసాం. చూపిస్తా' అంటూ ఆల్బం తీసింది.
చిన్నూకి ఫోటోలు చూస్తూ, అమ్మ చెప్పే కథలు వినటం ఇష్టం, అన్నీ మరిచిపోయి, మామూలు అయిపోతాడు.
***
మర్నాడు రవి, ఉష మధ్యాహ్నం అన్నం ముందు కూర్చున్నారే కానీ, నిన్న సాయంత్రం జరిగిన సంఘటన గుర్తొస్తోంది.
'''కర్రోడా, నల్లోడా'' అని నల్లటి మమ్మల్ని చిన్నప్పుడు పిలిచేవారు. కానీ నలుపు అన్ని విశేషణాలు లాగే ఒక డిస్క్రిప్షన్‌లా ఉండేది.' చిన్నతనం గుర్తుచేసుకుంటూ అన్నాడు రవి.
'పొడుగు వాళ్లకి, పొట్టి వాళ్లకి, తెల్లటి వాళ్లకీ వాళ్ల వేరుతనాన్ని బట్టో, ప్రత్యేకత బట్టో ఏదో ఒక నిక్‌నేమ్ ఉండేది. నేను నలుపని ఎప్పుడూ ఏడ్చే పరిస్థితి నాకు రాలేదు' అన్నం నోట్లో పెట్టుకోకుండా మళ్లీ మళ్లీ కలుపుతూ అన్నాడు రవి. ఉష మౌనంగా వింటోంది.
'తెల్లటి ఆడపిల్లల చేత ఫంక్షన్‌లప్పుడు గెస్ట్‌లకు బొకేలు ఇప్పించినా, మా అబ్బాయిల వరకూ నలుపు ఇప్పుడంత సమస్య కాలేదు. మా టీచర్లలో అన్ని కులాలు, రంగులు, సైజుల వాళ్లు ఉన్నారు. వాళ్ల టీచింగ్‌ని బట్టో, మాతో ఉన్న తీరుని బట్టో వాళ్లని ఇష్టపడటం, పడకపోటం ఉండేది. కానీ వాళ్ల వంటి రంగుని మేము పట్టించుకోలేదు!' ఆలోచనగా అన్నాడు రవి.
'మన పల్లెటూళ్లలో నా తెలుపు... నిజానికి నేను తెలుపేంటి! చామనుఛాయ. కొన్ని సందర్భాల్లో నా రంగు ఒక గుర్తింపు ఇచ్చినా, నా ప్రవర్తన వల్లే నన్ను ఇష్టంగా చూసేవారు. మా చెల్లి సునీత నా కంటే రంగు. దాన్ని అందరూ తిట్టేవారు. దాని బద్ధకానికి, నోటి దురుసుకి. ఏమైనా నలుపువాళ్లని తక్కువగా చూడటం ఇప్పుడు, ఇక్కడ చూస్తున్నంత లేదు.' ఉష మాటలు వింటూ అవునన్నట్టు తలూపాడు రవి.
సిటీలో, ముఖ్యంగా ఈ కార్పొరేట్ స్కూళ్లల్లో నలుపు ఇంత ''నల్లగా'' ఉంటుందనే స్పృహ ఉషని ఆలోచనలో పడేసింది.
'ఏ ప్రకటనల్లో చూసినా తెల్లనిపిల్లలు, తెల్లని అమ్మానాన్నలు, తెల్లని కుటుంబాలు. సినిమాల నిండా మిల్కీ సుందరులు. హీరోయిన్‌లు ఒక్కరే కాదు, హీరోలు, వాళ్ల అమ్మానాన్నలు, ఫ్రెండ్స్ అందరూ సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ అంబాసిడర్ లే.' ఉష పోలిక రవికి నవ్వు తెప్పించింది.
'ఇక పిల్లలు చూసే కార్టూన్లలో... ముఖ్యపాత్రలు ఎప్పుడూ తెల్లనివాళ్లే. నల్లని వాళ్లు చెడ్డవాళ్లు.. సిల్లీ జోకర్లు! వీటి ప్రభావం ఏంటంటే నలుపు శరీరం రంగు కాదు, ఒక చెడ్డతనం, ఒక డెప్త్‌లేని క్యారెక్టర్ అని మెసేజ్ పోతోందని గమనించరా?' ఆవేశంగా, ఆవేదనగా అంది ఉష.
'సిక్స్ ప్యాక్‌తో పాటు తెలుపు, నునుపు తప్పనిసరి అయ్యాయి ఈ రోజుల్లో' ఆలోచనగా బయటకి చూస్తూ అన్నాడు రవి.
'ప్రస్తుతం నున్నటి గడ్డాలు, వంటి మీద ఒక్క వెంట్రుక లేకపోటం పెద్ద ఫ్యాషన్! మగవాళ్లకీ వ్యాక్సింగ్.. బ్యూటీ స్టాండర్డ్స్ వచ్చేశాయి. చిన్నూగాడు ఈ వరదలో ఎలా పెరుగుతాడో' ఆందోళనగా అంది ఉష.
***
మర్నాడు ఉష పనులు చేసుకుంటోందన్న మాటేగానీ నల్లగా ఉన్నానని చిన్నూ ఏడ్చిన ఏడుపే పదే పదే చెవుల్లో వినిపిస్తోంది. రకరకాల ఆలోచనలు తొలిచేస్తున్నాయి.
'ఒకసారి, ఆశతో మాట్లాడితే? ఎంతమందితో మాట్లాడగలను? మాట లేకుండా ''నువ్వు నలుపు'' అని వేరుగా ట్రీట్‌చేసే వాళ్లని ఏం చేయాలి?' మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది.
కింద ఉన్న పుస్తకాలు షెల్ఫ్‌లో పెడుతుంటే ఎంఏలో తను చదివిన పుస్తకాలు నీట్‌గా అట్టలు వేసి, పుస్తకం పేరు, రచయిత పేరు స్పైన్ మీద రాసి పెట్టినవి కళ్లముందు కనిపించాయి. ఆ పుస్తకాల్లో సంఘటనలు, మనుషులు గుర్తుచ్చాయి.
'బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్', అమెరికా బ్లాక్ మూవ్మెంట్ స్లోగన్. అప్పుడు ఆ నల్లవాళ్లు శరీరాన్ని తెలుపు చేసుకోవటం, జుట్టు సాఫీగా చేయించుకోటం మానేశారట!' తను చదువుకున్నవి గుర్తొచ్చింది ఉషకి.
'తన నలుపుకి బాధపడే స్థితిలోకి చిన్నూని వెళ్లనివ్వకూడదు' అనుకుంది ఉష. ఆలోచనలోపడి ఎంతసేపు అలానే కూర్చుండిపోయిందో తెలీలేదు.
చివరికి మధ్యాహ్నం చిన్నూకి స్కూల్లో టిఫిన్ బాక్స్ ఇచ్చి, మూడు గంటలకి పిక్ అప్ చేసుకోమని రవికి చెప్పి, ఉష కంప్యూటర్ సెంటర్‌కి బయలుదేరింది.
శివుడు, చిన్ని కృష్ణుడి ఫోటోలు ఫోటోషాప్ చేసి, ప్రింట్ ఇవ్వాలని అడిగింది. అక్కడ పనిచేసే పద్దెనిమిదేళ్ల అబ్బాయికి ఉష రిక్వెస్ట్ కొత్తగా ఉండి, పనిచేయటానికి ఉత్సాహం చూపించాడు.
శివుడి బొమ్మలు గూగుల్ చేస్తుంటే సిక్స్ ప్యాక్‌తో, పులి చర్మం తొడిగిన 'యోధుడు', శివుడి వేషంలో శూలంతో పొడవటానికి సిద్ధంగా ఉన్న 'వీరుడు' తప్ప చిన్నప్పుడు తమ ఇంట్లో కాలెండర్ల మీద ప్రశాంత, నిశ్చల మంచు పర్వతాల బ్యాక్‌గ్రౌండ్‌లో, మందహాసంతో, యోగ ముద్రలో ఉన్న శివుడు కానీ, గరళాన్ని కంఠంలో పెట్టి ప్రశాంతంగా భార్యాబిడ్డలతో ఉన్న శివుడు కానీ కనబడలేదు.
చివరికి, అబ్బాయి పట్టుదల, ఫొటో షాపింగ్ స్కిల్‌తో ఉష ఆశించిన శివుడు ఫొటోలు రెండు తయారయ్యాయి. అబ్బాయి పనికి ముచ్చటపడింది ఉష. కృష్ణుడి ఫొటోలు పెద్ద కష్టపడకుండానే దొరికాయి. సెలెక్ట్ చేసుకున్న బొమ్మలు ప్రింట్ తీయించుకుని, ఇంటికి బయలుదేరింది.
సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి రవి, చిన్నూ షెటిల్ బ్యాట్లతో, చుట్టుపక్కల పిల్లలు, నిక్కీతో సహా ఆటల్లో మునిగిపోయి ఉన్నారు.'అంకుల్ ఈసారి నాకు' అంటూ పిల్లల అరుపులతో గోలగా ఉంది ఇంటిముందు వాతావరణం. రవి ఒకసారి చిన్నూతో, మరోసారి కొంచెం పెద్ద పిల్లలతో ఆడుతూ అవధానం చేస్తున్నాడు. మధ్యలో చిన్నూని కొంచెం పెద్దపిల్లలకి వదిలి తాను వేరేవాళ్లతో ఆడుతున్నాడు. పిల్లలు నవ్వుకుంటూ, 'నువ్వు కొట్టకుండా వదిలేశావే' అని తిట్టుకుంటూ అరుపులతో, కేకలతో ఒక తిరునాళ్లలా ఉంది. రవి ప్రయత్నం అర్థమైన ఉష అతనితో కళ్లు కలిపి, చెయ్యి ఊపి పైకి వెళ్లింది. చిన్నూ ఆటలో పూర్తిగా లీనమై, తల్లి రావటం కూడా గమనించలేదు.
చీకటి పడుతుండగా, 'నాన్నా, నాన్నా.. చూడు.. నేను ఇలా ఎగిరి ఠ.. ఫా.. మని కొట్టనా.. నిక్కీగాడు బాట్‌తో కొట్టకుండా, చేత్తో పట్టేసుకున్నాడు. హ..హ..' అంటూ ఉత్సాహంగా చెబుతుంటే 'చిన్నూ, కాక్ జారిపోతోంది పట్టుకో.. పట్టుకో..' అంటూ లోపలికి వస్తున్నారు రవి, చిన్నూ.
ఇంట్లోకి రాగానే గోడ మీద ఫొటోలు చూసి ఉత్సాహంగా, 'హారు, చిన్నికృష్ణుడు!.. ఇది నేనే' అంటూ అమ్మ అంటించిన పోస్టర్స్ చూస్తూ శివుడి ఫొటో దగ్గరకి వచ్చి 'నాన్నా చూడు.. మన ముగ్గురం ఇగో పార్వతీ దేవి, మన అమ్మే. నేనాడుకుంటుంటే చూస్తోంది. చూడు తెల్లగా ఉంది. నాన్న, ఇది నువ్వు' శివుడిని చూపిస్తూ, 'ఆఫీస్ నుండి వచ్చావు. నాన్నా, నువ్వు ఆఫీస్‌కి నిక్కరేసుకు వెళ్తావా నాలా?' పక పకా నవ్వుతూ.. పులి చర్మం నిక్కరులా అనిపించి.
నాన్న అలాగే ఆఫీస్‌కి వెళితే అనే ఊహ చిన్నూకి తమాషాగా ఉంది.
రవి, ఉష కూడా చిన్నూ నవ్వుతో జత కలిపారు. చిన్నూ, రవి పోస్టర్లు చూడటంలో మునిగిపోయారు.
'నల్ల కృష్ణయ్య, నల్ల శివయ్య, మొహం, కాళ్లూ చేతులు కడుక్కుంటే తెల్లని పాలిస్తాను.' నవ్వుతూ అంది ఉష.
నలుపుని విశేషణం చేస్తున్న ఉషని కళ్లతోనే అభినందించి 'పదరా నల్ల పిల్లాడా!' అని చిన్నూని పరుగు పెట్టించాడు రవి.
పాల గ్లాసు పట్టుకుని ఆ బొమ్మల కథలన్నీ చెప్పమని కూర్చున్నాడు చిన్నూ. వెన్న దొంగిలించటం ఉన్న పోస్టర్ ముందు కూర్చుని అమ్మ చెప్పే కథ వింటున్నాడు. గోపికలు పల్లెటూర్లో వాళ్ల పిల్లలకి కొంచెం కూడా వెన్న పెట్టకుండా, సిటీలో షాపులకి అమ్మేస్తున్నారు అని కోపం వచ్చి, కృష్ణుడు వెన్న దొంగిలించి పిల్లలకి పెట్టాడని అమ్మ చెబుతున్న కథలో లీనమైపోయి, నల్ల కృష్ణయ్య చిన్నూకి హీరో అయిపోయాడు. చిన్నూతో పాటు రవి కూడా ఈ కొత్త కథనాలు ఆసక్తిగా వింటున్నాడు.
ఆవుల్ని, మనుషుల్ని చెరువులో నీళ్లుతాగనివ్వకుండా 'చెరువు దగ్గరకొస్తే కాటేస్తా' అంటూ అడ్డంపడుతున్న కాళీయుడితో యుద్ధం చేసి ఓడించిన బుల్లి కృష్ణుడు కథ విని చిన్నూ, 'అమ్మా, నా అంత ఉన్నాడా కృష్ణుడు? నా కంటే పెద్దవాడా ?' సందేహంగా అడిగాడు.
'నువ్వు కృష్ణుడి చెవుల వరకూ వస్తావు' జాగ్రత్తగా చిన్నూని, కృష్ణుడిని పరిశీలించి చెప్పింది ఉష.
'అమ్మా, నాకు బోలెడంత బలం ఉంది. నేనూ రోలు లాగనా?' పిడికిలి బిగించి, రెండు చేతులూ పైకెత్తి తన బలప్రదర్శన చేస్తూ అడిగాడు.
'నువ్వు రోలు లాగటం కాదురా, నేను యశోదమ్మలాగా నీ చెవి మెలేస్తాను' రవి నవ్వుతూ చిన్నూ చెవి పట్టుకుని మెలివేసి వదిలి, వాడిని గాలిలోకి ఎత్తి పొట్టమీద ముక్కుతో రాశాడు. చిన్నూ చక్కిలిగింతలు తట్టుకోలేక, గట్టిగా అరుస్తూ నవ్వుతున్నాడు.
***
వేసవి సెలవులకి అందరూ ఉష వాళ్ల ఊరు వచ్చారు. ఉష చుట్టాల ఇళ్లన్నీ పక్క పక్కనే. ఉష కజిన్స్ కూడా వాళ్ల పిల్లల్ని తీసుకొచ్చారు. అందరూ ఇంచుమించు ఒకటే వయసు వాళ్లవటంతో వీళ్ల పిల్లలూ అటూ ఇటుగా చిన్నూ వయసే. ఎవరింట్లో ఏ టైంకి ఏం తింటున్నారో ఎవరికీ ఏమీ తెలీటం లేదు. కొద్దిగా పెద్ద పిల్లల వెనుక వానర సైన్యంలా పోతున్నారు ఈ చిన్నవాళ్లు. ఈ వానర సైన్యం ఉష వాళ్ల మేడ మీదకి బయలుదేరింది. వాళ్లలో ఉష చెల్లెలు సునీత ఐదేళ్ల కొడుకు నితీష్, చిన్నూతో, 'నువ్వు ఇంత నల్లగా ఉన్నవేంటి? నువ్వేమీ బాగోలేవు.' అన్నాడు.
బట్టలు ఆరేయడానికి మెట్లెక్కబోతున్న ఉష చెవిలో పడ్డాయి ఈ మాటలు.
'అవును నేను నల్లగా ఉంటాను, కృష్ణుడిలాగా. పాము మీద డాన్స్ చేసే కృష్ణుడిని చూశావా, మా ఇంట్లో ఉంది, ఆ ఫొటో. ఎంత బాగుంటాడో! మా అమ్మ నాకు ఆ కథ చెప్పింది. నీకు తెలుసా?' గొప్పగా అన్నాడు చిన్నూ.
'నాకేం తెలీదు ఆ కథ. అయినా నేను నీతో ఆడుకోను, నువ్వు నల్లగా ఉన్నావు' అన్నాడు నితీష్ మొండిగా.
'గుళ్లో దేముళ్లందరూ నల్లగానే ఉంటారు. నేనూ అంతే' మెట్లెక్కుతున్న అమ్మని చూసి 'అమ్మా అవును కదా?' అన్నాడు చిన్నూ, కన్‌ఫర్మ్ చెయ్యి అన్నట్టుగా.
'అవును రా, నిజమే, గుళ్లో విగ్రహాలన్నీ నలుపే' అంది ఉష నవ్వుతూ.
నితీష్‌కి ఏమనాలో తెలియలేదు.
నితీష్ తలకాయ మీద చిన్నగా తట్టి 'ఒరేరు, అందరూ కలిసి ఆడుకోవాలిగానీ, నలుపు, తెలుపు ఎందుకురా? నువ్వు చిన్నికృష్ణుడి కథ వినలేదా, రాత్రికి చెపుతానులే.' నితీష్ మొహం వెలిగింది. 'అదుగో, అన్నా వాళ్లు మామిడికాయలు కోస్తున్నారు, పోయి తెచ్చుకోండి. ఉప్పు, కారం వేసుకుని, తిందాం' అంది. వాళ్లు మామిడికాయల కోసం పరుగుపెట్టారు.
చిన్నూ మాటలు ఒక రిలీఫ్ ఇచ్చాయి ఉషకి. మామిడికాయల కోసం పరుగుపెడుతున్న చిన్నూని చూస్తూ, 'ఈ నలుపు చిన్నూకి ఎప్పటికీ ఎదురయ్యే సమస్యే, కానీ వాడు దాన్ని బాగానే ఫేస్ చేస్తాడు' అని అనుకుంది.
కూరెళ్ల పుష్పవల్లి
vallikpg@gmail.com