ప్రజాశక్తి-తెనాలి : కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ బి.జనార్ధనరావు గురువారం వెల్లడించారు. గంజాయికి బానిసలైన నలుగురు యువకులు గుంటూరు నుంచి గంజాయి కొనుగోలు చేసి, వారు సేవించటమే కాకుండా విద్యార్థులకు విక్రయిస్తున్న వారు మండలంలోని అంగలకుగురులో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేశారు. ఓ గదిలో గంజాయి సేవిస్తుండగా నలుగుర్ని పట్టుకుని వారి నుండి 1.4 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. నిందితుల్లో గుంటూరుకు చెందిన బొంతా నితిన్ అలియాస్ కిట్టు, అంగలకుదురుకు చెందిన క్రోసూరు వెంకట పవన్ సాయిరామ్, చింతలపూడికి చెందిన సంఘం ఉదయకిరణ్, తెనాలిలోని చెంచుపేటకు చెందిన జమ్మలమూడి గోపి ఉన్నారు. వీరంతా ఒకరికొకరు కొంతకాలం క్రితం పరిచయమయ్యారు. బొంతా నితిన్ గుంటూరుకు చెందిన కటకం రాజేష్, దాసరి జంజరు వద్ద గంజాయి కొనుగోలు చేస్తాడు. దానిని సంఘం ఉదయకిరణ్ ఉంటున్న అంగలకుదురులోని శ్రీనగర్ కాలనీ రూమ్‌లో ఉంచి, అదే రూములో నలుగురూ కలిసి గంజాయి సేవిస్తారు. మిగిలిన గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి వడ్లమూడి, అంగలకుదురు ప్రాంతాల్లో విద్యార్థులకు విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో సంఘం ఉదయకిరణ్ బుధవారం బొంతా నితిన్‌కు ఫోన్ చేసి కిలోన్నర గంజాయి కావాలని కోరగా, అతను దానిని తీసుకుని ఉదయ కిరణ్ రూమ్‌కు చేరుకున్నాడు. దానిలో కొంత గంజాయిని తీసి సేవిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన కటరం రాజేష్, దాసరి సంజరు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సిఐ కె.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఎఎస్‌ఐ పోతురాజు, పిసిలు పి.శ్రీనివాసులు, ఎం.రాము, పి.లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.










