ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో నలుగురు సభ్యులతో కుమ్మరి, శాలివాహన సంక్షేమ కమిటీ ఏర్పాటైనట్లు ఆ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ మండేపూడి పురుషోత్తం వెల్లడించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే అధికారిక కమిటీలో అధికారులతో పాటు, గుర్ల మండలం కోటగండ్రేడుకు చెందిన ఉబ్బిశెట్టి అప్పలస్వామి, లక్కవరపు కోట మండలం రంగరాయపురానికి చెందిన స్వయంబారకు కనకారావు, విజయనగరంలోని దాసన్నపేటకు చెందిన దొండిగల్లు పాపారావు, గజపతినగరం మండలం లోగిశకు చెందిన అరటి లక్ష్మిని సభ్యులుగా కలెక్టర్ నియమించినట్లు తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఛైర్మన్ జిల్లా కలెక్టర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలసి శాలివాహన కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేదోడు పథకం కుండలు తయారుచేసే వారికి కూడా వర్తింప చేయాలని ముఖ్యమంత్రిని కోరామని,త్వరలోనే కుమ్మరి వృత్తివారికి కూడా ఈ పథకం కింద రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని అన్నారు. కవయిత్రి మొల్ల జయంతిని మార్చి 13న ప్రభుత్వ వేడుకగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పారు. కవయిత్రి మొల్లపై తితిదే రూపొందించిన పుస్తకం త్వరలోనే విడుదల కానుందని వెల్లడించారు. ఆయన వెంట జిల్లా బిసి సంక్షేమాధికారి యశోధనరావు, బిసి కార్పొరేషన్ ఇడి జి.పెంటోజీ రావు ఉన్నారు.










