ప్రజాశక్తి-రోలుగుంట : నల్లరాయి క్వారీల పర్యావరణ అనుమతుల కోసం గ్రామసభలు తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, రోలుగుంట మండల కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి జిల్లా కలెక్టర్ రవిపఠాన్‌శెట్టికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రం నిండుగొండ, కొవ్వూరు గ్రామ పంచాయతీ పరిధిలో పదివేల మంది జనాభా ఉన్నారన్నారు. ఈ గ్రామాలు ఫ్లోరైడ్ గ్రామాలుగా గుర్తించి నేటికీ 14ఏళ్లు గడుస్తున్నా సురక్షిత నీటి సరఫరాకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. సంవత్సరాలు అవుతుందని, 2008లో రూ.మూడు కోట్లతో వరాహనది నుండి గొట్టం బావుల ద్వారా రోలుగుంట మండల కేంద్రం మీదుగా 11 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారన్నారు. వర్షాకాలం వస్తే గెడ్డలో బురద నీరు సరఫరా అవుతుందన్నారు. ఎండాకాలం వస్తే వారానికి రెండుసార్లు కూడా నీరు సరఫరా జరగడం లేదన్నారు. మండల కేంద్రంలో రూ.26 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, పుష్కరమైనా నేటికీి వినియోగంలోకి తీసుకు రాలేదన్నారు. నిండుగొండ, కొవ్వూరు, రోలుగుంట గ్రామాల్లో 2009లో నల్లరాయి క్వారీలు ప్రారంభించారని, నేడు 30 నల్లరాయి క్వారీలు ఏర్పాటు చేశారన్నారు. నేటికీ 13 ఏళ్లు గడిచినా పర్యావరణ శాఖ కన్నెత్తి చూడలేదన్నారు. కొండ పక్కన ఉన్న గడ్డలు అన్ని కూడా కప్పేసి, దుమ్ము ధూళితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, మామ్మూళ్ల మత్తులో ఉన్న మైనింగ్‌శాఖ పట్టించుకోవడం లేదన్నారు. పర్యావరణ నిబంధనకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధలనకు విరుద్ధంగా భారీ బ్లాస్టింగ్‌లతోపాటు, భారీ వాహనాల రాకపోకలతో దుమ్ముధూళిరేగి శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. క్వారీలారీలతో పాడౌతున్న బిఎన్‌రోడ్డు దుస్థితిపై దృష్టి సారించాలని కోరారు.. ఈ పరిస్థితుల్లో ఈ నెల 26వ తేదీన నిండుగొండ, రోలుగుంట, శరభవరం గ్రామాల్లో మూడు క్వారీలకు పర్యావరణ అనుమతులు కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. తూతూమంత్రంగా గ్రామ సభలు నిర్వహించడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.










