ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లాలోని రావికమతం మండలం మరుపాక రెవెన్యూ సర్వే నెంబర్ 258లో గిరిజన భూముల్లో 22 ఎకరాలకు నల్లరాయి క్వారీకి ఇచ్చిన లీజు రద్దు చేయాలని, పర్యావరణ అనుమతులను తిరస్కరించాలని, దీనిపై జాయింట్ కలెక్టర్‌తో విచారణ చేపట్టాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ఆ గ్రామస్తులు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత గిరిజనులు మాట్లాడుతూ ఈ భూముల్లో 14 గిరిజన కుటుంబాలు 20 ఏళ్లుగా గొర్రెలు మేకలు పెంపకం, జీడి మామిడి తోటలు, యూకలిప్టస్ తోటలు వేసుకుని జీవిస్తున్నామని తెలిపారు. ఆ భూముల్లో బిఎంజె అప్పారావు పేరుపై రోడ్డు బిల్డింగ్ మెటల్ స్టోన్ క్రషర్‌కు 2018లో అనుమతులు ఇచ్చారన్నారు. సదరు భూముల్లో పిల్లర్స్ వేయడంతో అప్పట్లోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని చెప్పారు. గ్రామానికి అతి సమీపంలో క్వారీ ఏర్పాటు చేయడం వల్ల తమ తోటలకు, గొర్రెలు మేకలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు నివేదికలతో అనుమతులు పొందిన క్వారీ లీజుతో పాటు పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు మూలపర్తి నూకాలమ్మ, వరహాలమ్మ చిన్నతల్లి, ఏపీ గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్డ్ సాధన సమితి గౌరవ అధ్యక్షులు కె.గోవిందరావు, మరుపాక రైతు సంఘం నాయకులు సోమిరెడ్డి పరమేష్, గొర్రెలు మేకల పెంపకం దారులు పాల్గొన్నారు.










