ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని బుచ్చిరాజుపేట పంచాయతీ నల్లమట్టిపాలెంలో శనివారం సాయంత్రం నర్సీపట్నం ఆర్డీవో జయరాం ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామంలో సర్వే నెంబరు 151-2లో వున్న భూమి పచ్చిక బయలుగా (22ఏ రికార్డుల్లో) రెవెన్యూ రికార్డుల్లో నమోదైవుంది. ఈ రికార్డుల నుంచి ఈ భూమిని తొలగించాలని గతంలో వరహా ఆక్వా ప్రతినిధుల దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో జయరాం, తహసీల్దార్ నీరజ నేతృత్వంలో గ్రామ సభ నిర్వహించారు. రైతులు, పెద్దల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పూర్వం నుంచి ఈ భూముల్లో పశువులను మేపుకునే వారమని కొందరు రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. తమ అభ్యంతరాలు, పూర్తి వివరాలు తెలియజేసేందుకు గ్రామస్తులు రెండు రోజులు గడువు అడిగారు. దీంతో ఆర్డీవో గ్రామసభను వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










