May 14,2023 22:35

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌


నల్లమల అడవుల్లో ఉత్సాహంగా..
- లోకేష్‌ను కలిసిన సేవ్‌ ద టైగర్‌ ప్రతినిధులు
- వెలుగోడులో వెల్లువెత్తిన జనం
ప్రజాశక్తి-వెలుగోడు

     టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 99వరోజు శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు అటవీ ప్రాంతంలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర దారిలో యువనేత వివిధ వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. ఆదివారం సాయంత్రం వెలుగోడులో యువనేత పాదయాత్రకు జనం వెల్లువెత్తారు. లోకేష్‌ని చూసేందుకు, కలిసి సమస్యలు చెప్పుకునేందుకు భారీగా ప్రజలు రోడ్ల పైకి వచ్చారు. వెలుగోడు ప్రజలు భవనాల పైకి ఎక్కి లోకేష్‌ కి అభివాదం చెప్పారు. లోకేష్‌ ని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, రైతులు, యువత, వద్దులు పోటీపడ్డారు. టిడిపి అధికారంలోకి రాగానే స్థానికంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉదయం కొత్తరామాపురం గ్రామస్తులు లోకేష్‌ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. దాదాపు 5 కిలోమీటర్ల మేరకు అటవీ ప్రాంతంలో లోకేష్‌ పాదయాత్ర కొనసాగించారు. వెలుగోడు అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో నల్లకాల్వలో మాజీముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి లోకేష్‌ నివాళులర్పించారు. అనంతరం సేవ్‌ ద టైగర్‌ క్యాంపెయిన్‌ ప్రతినిధులు ఇమ్రాన్‌ సిద్ధిఖీ, సీనియర్‌ జర్నలిస్టు పులిపాక బాలు యువనేతను మర్యాదపూర్వకంగా కలుసుకుని పులుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అటవీ ప్రాంతంలో పాదయాత్ర సమయంలో తెలుగుగంగ కాల్వను యువనేత సందర్శించారు. అనంతరం వెలుగోడు శివార్లలో ఫారెస్టు కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులతో సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం వెలుగోడు మీదుగా పాదయాత్ర బోయరేవులకు చేరుకుంది. పాదయాత్ర దారిలో బెస్తలు, బుడగ జంగాలు, ఎస్సీలు, వికలాంగులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. 99వరోజు 16.2 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు యువనేత లోకేష్‌ 1268.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో మాజీ మంత్రి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇంఛార్జి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.
నువ్వు పిల్లకాల్వ అయినా తవ్వావా జగన్‌..?
తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శించిన యువనేత లోకేష్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నరు వాసుకు తాగునీరు అందించాలన్న విశాల ధృక్పథంతో మా తాత ఎన్టీఆర్‌ కట్టిన తెలుగుగంగ ప్రాజెక్టు (వెలుగోడు బ్యాలన్సింగ్‌ రిజర్వాయర్‌) ఇది. దీనిద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు అందడమేగాక చెన్నరు వాసుల దాహార్తి తీరుతోంది. అధికారంలోకి వచ్చినప్పటినుంచి దోచుకోవడం, దాచుకోవడమే తప్ప రాయలసీమ ప్రజలకోసం ఒక్క పిల్లకాల్వ అయినా నిర్మించావా జగన్మోహన్‌ రెడ్డీ'' అంటూ చురకలు వేశారు.