Aug 31,2023 22:39

నిరసన వ్యక్తం చేస్తున్న డాక్యుమెంట్‌ రైటర్లు

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ :రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంటు రైటర్ల సంక్షేమంపై దృష్టి సారించకుండా కార్డ్‌ ప్రైమ్‌ 2.0ను ప్రవేశపెట్టడం బాధాకరమని ధర్మవరం డాక్యుమెంటు రైటర్ల సంఘం నాయకులు పేర్కొన్నారు. కార్డ్‌ ప్రైమ్‌ 2.0ను నిరసిస్తూ రెండవ రోజైన గురువారం పెన్‌డౌన్‌ కార్యక్రమంలో భాగంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానంలో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. కార్డ్‌ ప్రైమ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తే సామాన్యులు మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. డాక్యుమెంటు రైటర్ల లైసెన్సును పునరుద్ధరించి, అందుకు తగిన రుసుము నిర్ణయించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మల్లికార్జున, బాలాజీ, మహేంద్ర, గోపి, భాస్కర్‌, నాగార్జున, జావీద్‌, వెంకటేశ్‌, ధను, యస్వంత్‌, అనిల్‌, నూర్‌, తేజ, కార్తీక్‌ పాల్గొన్నారు.