Oct 29,2023 21:44

రాయదుర్గంలో నిరసన తెలుపుతున్న ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఉద్యోగులు

           ప్రజాశక్తి-రాయదుర్గం    ఎపిఎస్‌ ఆర్టీసీ డ్రైవర్‌పై దుండగుల దాడిని ఖండిస్తూ ఆదివారం స్థానిక డిపో ఆవరణలో నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన తెలిపారు. కావలిలో ఎపిఎస్‌ ఆర్టీసీ డ్రైవర్‌పై దుండగుల దాడిని ఖండిస్తూ నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాయదుర్గం డిపోలో ఆదివారం ఉదయం 5 గంటల మొదటి సర్వీసు నుంచి ఎన్‌ఎంయుఎ సభ్యులు, ఉద్యోగులు 'నల్ల బ్యాడ్జీలు' ధరించి విధులకు హాజరయ్యారు. డ్రైవర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ, డ్రైవర్‌కు సంఘీభావం తెలుపుతూ, నిరంతరం ప్రజల మధ్య విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులపై దౌర్జన్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాడి చేసిన అల్లరిమూకలపై కఠినచర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిపో కార్యదర్శి హెచ్‌టి స్వామి, ఉద్యోగులు వేణుగోపాల్‌, రామచంద్ర, మైలారప్ప, రామాంజనేయులు, శివుడు, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాయదుర్గం డిపోలో గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో రాయదుర్గం డిపో ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు శ్రీరాములు, బాషా, డిపో ట్రెజెరర్‌ రెడ్డి, రిజనల్‌ కమిటీ సభ్యులు జగదీష్‌, కేశన్న, లతీఫ్‌, రెడ్డి, రాధాకృష్ణ, స్వామి, నాయక్‌, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.
గుత్తి : కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ రామ్‌సింగ్‌ పై దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ డిపోలో ప్రధాన గేటు వద్ద ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులను గమ్యం చేర్చే ఆర్టీసీ డ్రైవర్‌ రామ్‌సింగ్‌ పై దాడి పాల్పడడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్‌ పై దాడి పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రీజినల్‌ ఉపాధ్యక్షులు డి.హుసేన్‌ సాహెబ్‌, డిపో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఆర్‌. ఆంజనేయులు, సిసిఎస్‌ డెలిగేట్‌ పీకే.రాముడు, ఎడిసి బెల్లం శ్రీనివాసులు, సీనియర్‌ నాయకులు హెచ్‌ఎండి.అరీఫ్‌, జేపీ.రాముడు తదితరులు పాల్గొన్నారు.