May 26,2023 23:40

తుళ్లూరు రైతు దీక్షా శిబిరంలో కళ్లకు గంతలతో నిరాహార దీక్ష చేస్తున్న మహిళా రైతులు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి/ తుళ్లూరు : పేదలకు ఇళ్లస్థలాల పేరుతో అమరావతిని నాశనం చేయవద్దని భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు కోరారు. ఆర్‌5 జోన్‌ పేరుతో ఇళ్లపట్టాల పంపిణీకి వ్యతిరేకంగా పలు గ్రామాల్లో రైతులు శుక్రవారం వెంకటపాలెంలో సిఎం సభ జరుగుతున్న సమయంలో నోటికి నల్లరిబ్బన్లు ధరించి, నల్ల బెలూన్లు ఎగురవేసి తమ వ్యతిరేకతను తెలిపారు. రాజధాని ద్రోహులు గో బ్యాక్‌ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. మందడం గ్రామంలో సిఎంకు వ్యతిరేకంగా నేలపైకూర్చుని నిరసన తెలిపారు. టెక్నాలజీ సిటీ రాజధానిలో ఎంపిక చేసిన స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం సబబుకాదని అన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర ప్రాంతాల్లో జరిగిన దీక్షా శిబిరాలో వారు నిరసన తెలిపారు. అనంతవరంలో నల్లజెండాలు, నల్లబెలూన్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలువలేని చెల్లని పట్టాలు పేదలకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిఎం సభకు బస్సుల్లో వెళ్తున్న ప్రజలకు నల్లజెండాలు, నల్లబెలూన్లు చూపుతూ రైతులు నినాదాలు చేశారు. కొందరు నల్ల దుస్తులు ధరించి కళ్లకు నల్లరిబ్బన్లు కల్టుకుని నిరసన తెలిపారు. ఇళ్లు, దుకాణాల వద్ద నల్లబెల్లూన్లు ఎగురవేశారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో శిలాఫలకం వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపారు. మందడంలో ఉరితాళ్లతో నిరసన తెలిపారు.