Apr 04,2021 06:52

చరిత్ర వేగంగా సాగిపోతుంటుంది. గతాన్ని సవ్యంగా అర్థం చేసుకుని వర్తమానంలో సక్రమంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మేలు జరుగుతుంది. 1982 మార్చి 29న పుట్టి నలభయ్యవ వార్షికోత్సవం జరుపుకొంటున్న తెలుగుదేశంకూ ఇది వర్తిస్తుంది. ఎన్‌టిఆర్‌, చంద్రబాబూ విజయాలూ ఓటములు ఈ భాషలో తెలుగుదేశంపై విశ్లేషణ చాలా సులభం. కాని సంపూర్ణం కాదు. చరిత్రను సక్రమంగా అర్థం చేసుకోవడమంటే వ్యక్తులనే గాకుండా శక్తులనూ చూడగలగాలి. రాష్ట్ర చరిత్రలో కొత్త మలుపులకు కారణమవడమే గాక దేశ రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన పార్టీగా టిడిపి కి ప్రాధాన్యత తప్పక వుంటుంది. ఇందులో మంచి చెడ్డలు కూడా విడమర్చి చూడవలసి వుంటుంది. కాని చరిత్రనే అక్కడి నుంచి ప్రారంభించడం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముని మనోవీధిలో ఆవిర్భవించి నవమాసాలు తిరక్కుండానే 1983లో అధికారం అధిష్టించిన టిడిపి తోనే ఆంధ్రుల చరిత్ర మొదలైనట్టు చెప్పడం వాస్తవికం కాదు. ప్రపంచాన్నే ఆకర్షించిన ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమ విజయాలు వీర తెలంగాణ రైతాంగ పోరాటం, రాష్ట్ర సాధన వంటివన్నీ కీలక ఘట్టాలు. ప్రకాశం పంతులు నుంచి పుచ్చలపల్లి సుందరయ్య వరకూ ఎందరో మహామహులు, కాంగ్రెస్‌ కమ్యూనిస్టు నాయకులు తెలుగువారి చరిత్రను తీర్చి దిద్దారు. అంతకు ముందు సాగిన కాంగ్రెస్‌ వ్యతిరేక ఉద్యమాల రాజకీయ ప్రభావం జోడించకుండా ఎన్‌టిఆర్‌ విజయాన్ని నవమాసాలకే పరిమితం చేయడం కూడా సహేతుకం కాదు. ప్రజలలో కాంగ్రెస్‌ పట్ల తారాస్థాయి వ్యతిరేకత, కళాకారుడుగా ఆయన ప్రత్యక్ష అనుబంధం, రెండు రూపాయల కిలో బియ్యం వాగ్దానం వంటివి లేకపోతే కేవలం ఆకర్షణ, అదృష్టం, చైతన్య రథ ప్రచారం మాత్రమే అక్కరకు వచ్చేదికాదు. ఏడాదిన్నర లోపే విరుచుకుపడిన నాదెండ్ల భాస్కరరావు తెచ్చిపెట్టిన 1984 తొలి ఆగష్టు సంక్షోభం అధిగమించడం జాతీయ పార్టీల, ప్రజా శక్తుల సహకారం లేకుంటే సాధ్యమయ్యేది కాదు. దేశంలో మారిన సమీకరణాలకూ కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం క్షీణతకూ అదో ఉదాహరణ. ఆ ఉద్యమంలో కమ్యూనిస్టు ఉద్యమం ఒక ముఖ్య పాత్ర వహించింది.
ఎన్‌టిఆర్‌లో సానుకూల అంశాలు, తప్పిదాలు
కేంద్ర నిరంకుశత్వంపై పోరాటం, ప్రజా సంక్షేమ పథకాల పట్ల ప్రత్యేక శ్రద్ధ, లౌకిక సూత్రాలకు ప్రతిపక్ష ఐక్యతకూ కట్టుబాటు ఎన్‌టిఆర్‌ లో విలక్షణాంశాలు. అనేక కొత్త వర్గాలనూ విద్యాధికులకూ ముఖ్యంగా బిసీలను ఆయన రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున తీసుకురాగలిగారు. మునసబు కరణాల రద్దు, మండలి రద్దు, మండలాల ఏర్పాటు లాంటి పాలనా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఎన్‌టిఆర్‌ తో సహా ఆ పార్టీని ముందుకు నడపడంలో కొన్ని ఆర్థిక సామాజిక శక్తులున్నాయి గనక వాటిని కాదని మౌలిక మార్పులను చేయలేకపోయారు. భూ సంస్కరణల వంటివి చేయలేకపోయారు. పార్టీలో ఐక్యత ఎప్పుడూ ఎండమావిగానే వుండింది. తొలి మహానాడులో ఉపేంద్రను కార్యదర్శిగా నియమించినప్పుడే విభేదాలు బహిర్గతమైనాయి. ఇద్దరు అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు మధ్య వైరుధ్యాలతో విసిగిపోయి 'పార్టీ నాతోనే వచ్చింది నాతోనే పోతుంది' అన్నారు. మంత్రివర్గ సామూహిక బర్తరఫ్‌ ద్వారా తనే సర్వస్వం అని సందేశమిచ్చారు. వంగవీటి రంగా హత్యానంతరం కాంగ్రెస్‌ ప్రతివ్యూహాలు పరాకాష్టకు చేరగా తెలుగుదేశం బేలగా వుండిపోయింది. ఇన్ని ఎదురు దెబ్బలు, తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేదు గనకనే 1989లో ఎన్‌టిఆర్‌ (ఒకచోట)తో సహా ఓడిపోయారు. తెలుగుదేశం పెట్టిన కొత్తలో ఎవరో కావాలని తికమక పెట్టేందుకు 'బిజెపి వామపక్షమా?' అని ప్రశ్న వేస్తే 'ఔను' అని బదులిచ్చారు ఎన్‌టిఆర్‌. కాంగ్రెస్‌ తప్ప అన్నీ వామపక్షాలేనన్నారు. అంతలోనే తేరుకుని 'బిజెపి మా మిత్ర పక్షం' అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో బిజెపి కూడా పాల్గొంది. కాని తర్వాతి కాలంలో ఎన్‌టిఆర్‌ దాన్నుంచి విడగొట్టుకుని కేవలం లౌకిక పార్టీలతో అవగాహనకు పరిమితమైనారు. నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడైనారు. 1990లో ఎల్‌.కె.అద్వానీ చేపట్టిన రథయాత్ర నిలిపివేసి అప్పటి వి.పి.సింగ్‌ నాయకత్వం లోని నేషనల్‌ ప్రంట్‌ ప్రభుత్వాన్ని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయోధ్య బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత 1993లో సారా వ్యతిరేక ఉద్యమాన్ని బలపర్చి సంపూర్ణ మద్య నిషేధం నినాదంతో 1994లో రెండవ సారి అధికారంలోకి వచ్చినపుడు బిజెపితో పొత్తు పెట్టుకోలేదు. లక్ష్మీ పార్వతితో ఎన్‌టిఆర్‌ రెండవ వివాహం అనంతర పరిణామాలలో ఇద్దరు అల్లుళ్లే గాక కుమారులు కూడా కలసి మరోసారి పదవి నుంచి తొలగించడం ఎన్‌టిఆర్‌ కు ఆఖరి దెబ్బ. అందులో స్వయంకృతమే ఎక్కువ. ఆ పరిణామాలలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు మీద వ్యతిరేకత ఎవరికి ఎంతున్నా బహిరంగంగా జరిగిన ఆ తిరుగుబాటును వెన్నుపోటు అనడం చెల్లుబాటు కాదు. ఈ అన్ని సంక్షోభాలలోనూ కాంగ్రెస్‌ కుట్రలకు వ్యతిరేకంగా టిడిపి ని ప్రజాస్వామిక శక్తులతో నిలబెట్టడానికి సిపిఎం ప్రత్యేకంగా కృషి చేసింది. కేంద్రంపై పోరాటంలో ఎన్‌టిఆర్‌ కు అప్పటి బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు వంటి వారు తోడు నిలబడ్డారు.
బిజెపితో కలిసి దారి తప్పిన చంద్రబాబు
వ్యవస్థాపకుడుగా ఎన్‌టిఆర్‌ కు నమస్కారం పెట్టినా ఇప్పుడున్న తెలుగుదేశం వ్యవస్థ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో పెరిగిందే. ఎందుకంటే 1996 పార్లమెంటు ఎన్నికలకు కొంచెం ముందు ఎన్‌టిఆర్‌ అనూహ్య మరణం తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు శకాన్ని ప్రారంభించింది. ఆయన కూడా వామపక్షాల మద్దతు లేకుంటే నిలదొక్కుకోవడం సులభమయ్యేది కాదు. జాతీయంగా చక్రం తిప్పారని ఆయన గురించి అదే పనిగా పొగుడుతుంటారు గాని ఆ చక్రం ఆయన చేతిలో పెట్టింది అప్పటి సిపిఎం ప్రధాన కార్యదర్శి, జాతీయ దిగ్గజం వంటి హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ అనే చారిత్రిక సత్యాన్ని దాటేస్తుంటారు. అయినా చంద్రబాబు తర్వాతి కాలంలో బిజెపితో జత కట్టారు. ప్రపంచ బ్యాంకు విధానాలతో చెలరేగిపోయారు. ఈ రెండు చర్యలకూ అంత:సంబంధం వుంది. ఈ విధానాలపై వామపక్షాలు సాగించిన వీరోచిత పోరాటమే తర్వాత వై.ఎస్‌ ప్రభుత్వం రావడానికి ఒక కారణమైంది, నలభయ్యవ పడిలో నాయకత్వం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏడు పదులు దాటారు. ఈ నలభయ్యేళ్లలో 21 ఏళ్ల కాలం తెలుగుదేశం అధికారంలో వుంది. అందులోనూ పద్నాలుగేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి. ఆ పార్టీ మంచి చెడ్డలకూ తప్పొప్పులకూ ఆయనే కర్త కర్మ క్రియ. ఎన్‌టిఆర్‌ గాని, చంద్రబాబు గాని వివిధ సందర్భాల్లో చేసిన పొరబాట్లే ఆ పార్టీని ఓటమికి ఒడుదుడుకులకు కారణమైనాయి. జ్యోతిబసులా పాతికేళ్లు పాలిస్తానన్న చంద్రబాబు స్వయంగా రెండవ సారి గెలిచిన సందర్భమే లేదు. ఆనాటి ప్రపంచ బ్యాంకు విజన్లు, హైటెక్‌ కీర్తనలు ఎలా వున్నా ఆయన రాజకీయంగా తిన్న దెబ్బలు చాలా వున్నాయి.
అవకాశవాదంతోనే అనర్థం
విద్యుచ్ఛక్తి ఉద్యమం తర్వాత రెండు సార్లు గెలిచిన వై.ఎస్‌ రాజశేఖర రెడ్డిని ఎదుర్కోవడంలోనూ రాష్ట్ర విభజన సమస్య లోనూ ఉక్కిరి బిక్కిరైన చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కష్టంగానే గడిపారు. దీనికి ముఖ్య కారణం ఆయన ఏదోలా అధికారంలోకి రావడం, కాపాడుకోవడం తప్ప కొన్ని నిర్దిష్ట ప్రజాస్వామ్య విధానాలకు నిబద్దంగా వుండకుండా అవకాశవాదంతో వ్యవహరించడమే. మతతత్వంతో రాజీపడటమే. ఆఖరుకు ఎ.పి విభజనకు కూడా అంగీకరించడానికిదే కారణమైంది. పదేళ్ల పాటు విభజన ఉద్యమంలో ఆయన ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో చెప్పడం కష్టం. పైగా విభజనకు రెండవ ప్రధాన కారణమైన బిజెపితో పొత్తు పెట్టుకున్నారు.
విభజిత ఆంధ్ర ప్రజలు బిజెపి జనసేనల పొత్తులో 2014లో ఆయనకు అధికారం అప్పగించినా అంతకు ముందరి ఊపు లోపించడానికి కారణాలు అనేకం. కేంద్రంలో వుంటూనే రాష్ట్రానికి రావలసినవి సాధించలేకపోవడం, అమరావతి రాజధానిని ఒక దశకు తీసుకురాలేకపోవడం వాటిలో పెద్దవి. ప్రజా ఉద్యమాలపై దాడులు, అసహనం కూడా తీవ్రంగానే కొనసాగాయి. చంద్రబాబు పాలనా రీతిలో వైఫల్యాలు చుట్టూ వంధిమాగధులను చేర్చుకోవడం, తీవ్ర తప్పిదాలను కూడా సమర్థించుకోవడం, అనుచిత ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఆర్థిక దుస్థితి చంద్రబాబు ప్రతిష్టకే గాక తెలుగుదేశం విశ్వసనీయతకు కూడా భంగకరంగా మారాయి. 2019 ఎన్నికలకు ముందు వీటిని ఏదో సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా జగన్‌ వైఎస్‌ఆర్‌సిపి చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. 1994లో కాంగ్రెస్‌కు 26 స్థానాలు మాత్రమే వస్తే ఈసారి తెలుగుదేశంకు 23 మాత్రమే వచ్చాయి. అసలు ప్రతిపక్ష హోదా కూడా వుంటుందో ఊడుతుందో చెప్పలేని పరిస్థితి. తెలంగాణలో అసలే ఠికానా లేకుండా పోయింది. ఎ.పి లోనూ 2019 కన్నా కూడా వారి ఓట్ల శాతం ఎంతగా పడిపోయిందీ మొన్నటి స్థానిక ఎన్నికలు కళ్లకు కట్టాయి.ఈ నలభయ్యవ వార్షికోత్సవ సందర్భంలోనే ఎ.పి లో జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను బహిష్కరించాలని టిడిపి నిర్ణయించడం కూడా ఇందుకు ఒక ప్రతిబింబమే. దీనిపైనా రకరకాల వ్యాఖ్యానాలున్నా విజయాలు లేకుండా పోయినందువల్ల కలిగిన విశ్వాస సంక్షోభం వాస్తవం. దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వున్నాయిగనక అనధికారికంగా పాల్గొనడమూ జరగొచ్చు.
ఆత్మ విమర్శ లేకపోతే అంతే!
ఏమైనా బలమైన యంత్రాంగం, వనరులు కలిగిన తెలుగుదేశం వంటి పార్టీకి ఇది గడ్డుకాలమే. అనుకూల మీడియా కథనాలపై హడావుడి చేస్తున్నంతగా ప్రజా సమస్యలపై ఆ పార్టీ పోరాటం లేదనే భావం, అంతర్గతంగా నిజమైన నాయకులను, కార్యకర్తలను గుర్తించలేదనే అసంతృప్తి అల్లుకుపోయాయి. పార్టీలో మిగిలిన సీనియర్‌ నేతలు చాలామంది నిర్లిప్తత వహిస్తుంటే కుమారుడు లోకేశ్‌కు ద్వితీయ స్థానమిచ్చినా నాయకత్వం అప్పగించే సూచనలు లేవు గనక చంద్రబాబు మీదే భారం వుంటోంది. ఆయన వ్యక్తిగతంగా జగన్‌ బృందం పైన విమర్శలే ప్రధానాస్త్రాలుగా కాలం గడుపుతున్న పరిస్థితి. ప్రభుత్వ పథకాల సానుకూల ప్రభావం అసలే చూడకపోవడం వాస్తవికత కాదు. జగన్‌ ప్రభుత్వం తప్పులు చాలా వున్నా వాటితోనే తాము వచ్చేస్తామని ఆశలు పెట్టుకోవడం సులభంగా నెరవేరేది కాదు. 2019 కాంగ్రెస్‌ చుట్టూ తిరిగి...ఇప్పుడు మళ్లీ బిజెపి మెప్పు కోసం రామతీర్థం వంటి ఘటనలపై వారిని మించి హడావుడి చేయడం, రాష్ట్ర ప్రభుత్వంపై తప్ప కేంద్రం లోని మోడీ నిరంకుశ పోకడలపై నోరు మెదపకపోవడం విశ్వసనీయతకు విఘాతంగా మారాయి. వైసిపి వలలో చిక్కి పూనకం వచ్చినట్టు ఓట్లు వేసి జగన్‌ను గెలిపించారని ప్రజలను తిట్టిపోయడం ఆక్రోశాన్ని, ఉక్రోషాన్ని వెల్లడిస్తుందే తప్ప పరిష్కారం చూపించదు. తెలుగుదేశంలో అంతర్గతంగా సరైన సమీక్ష, ఆత్మ విమర్శ చేసుకుని ప్రణాళికా బద్ధంగా ప్రజలకు, కార్యకర్తలకు చేరువైతేనేే భవిష్యత్తు.

                  నలభై ఏళ్ల తెలుగుదేశం - ఆత్మ విమర్శలోనే భవితవ్యం          - తెలకపల్లి రవి