ప్రజాశక్తి - మక్కువ : ఆరుగాలం శ్రమించిన అధిక దిగుబడి సాధించి లాభపడుదామనుకున్న ఆ రైతు నష్టాన్ని కోరి కొని తెచ్చుకున్న విధంగా తయారైన ఘటన మండలంలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మార్కొండపుట్టి పంచాయతీ పెదగయిసాల గ్రామానికి చెందిన రైతు వెంపటాపు తిరుపతిరావు యామరపాటుతో తన మూడు ఎకరాల వరి చేనుకు కలుపు మందును పిచికారీ చేశాడు. అనుకున్న మోతాదు కంటే అధికంగా 24శాతం క్లాస్మోడియం సాల్ట్‌ను వినియోగించి వేరొక రసాయనంతో కలిపి పంటపొలంపై పిచికారీ చేశాడు. అయితే ఒక రోజు పోయిన తర్వాత చూసిన రైతు పచ్చగా కనిపించిన పొలమంతా పసుపు రంగులో మారి ఎండిపోవడంతో లబోదిబోమన్నాడు. ఈ విషయం ఊరంతా తెలియడంతో వరి చేనును చూసిన రైతులంతా నిర్ధాంత పోయారు. స్థానిక వ్యవసాయాధికారికి సమాచారం ఇవ్వగా పంటపై యూరియా పిచికారీ చేయాలని సలహా ఇచ్చారు. అయితే వరి చేను ఏమాత్రం కూడా రికవరీ కాలేదు. చేసిన శ్రమ కాక మదుపు కోసం పెట్టిన రూ.లక్షా50వేలు నష్టపోవాల్సి వచ్చిందని కుటుంబీకులు బోరును వినిపిస్తున్నారు. పంటలపై మందులు పిచికారీ చేసేటప్పుడు సంబంధిత అధికారుల సలహా తీసుకోకపోవడం నష్టాల్ని రైతులు చవిచూడాల్సి వస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు 'ప్రజాశక్తి' కి తెలిపారు. ఇలా నష్టపోయిన రైతుకు ఏ విధమైన నష్టపరిహారం కూడా అందించలేమని ఆయన అన్నారు










