
ఒక అడవిలో ఓ నక్క నివసించేది. దాని నివాసానికి సమీపంలోని ఒక మడుగు వద్ద కొన్ని తాబేళ్లు, సమీప పొదల్లో కుందేళ్లు జీవించేవి. తాబేళ్లు ఒడ్డుకు వచ్చి విశాంత్రి తీసుకునేవి. అలా అవి ఆదమరిచి నిద్రించే సమయంలో నక్క వాటిని పట్టి చంపి తిని తన ఆకలి తీర్చుకునేది. ఇలా రోజుకో తాబేలు నక్కకు ఆహారం అయ్యేవి.
ఒకరోజు కుందేలు దప్పిక తీర్చుకునేందుకు మడుగు వద్దకు వచ్చింది. అక్కడ బాధతో కనిపించిన తాబేలుతో మాట కలిపి 'మిత్రమా! ఎందుకు దిగులుగా వున్నావు?' అని ప్రశ్నించింది. మా తాబేళ్ల సంతతి రాను రాను తగ్గిపోతుంది. దానికి నక్కబావే కారణం. కానీ ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే ఎందరో నక్కబావ ఆకలికి బలైపోయారని కన్నీరు పెట్టుకుంది తాబేలు. 'మిమ్మల్ని నక్కబావ గండం నుండి నేను తప్పిస్తాను. నేను చెప్పినట్లు చెయ్యాలి. ఆఖరి నిమిషంలో ధైర్యం కోల్పోకూడదు' అంది కుందేలు.
ఒకరోజు తాబేలు మడుగు గట్టున వున్న చెట్టు కింద నిద్రిస్తూ ఉంది. అక్కడికి వచ్చిన నక్కబావ ఈ రోజు నా పంట పండింది అనుకుని తాబేలును మెల్లగా పట్టుకుంది. నక్కబావకు దొరికిపోయానని తాబేలు గుర్తించింది. కుందేలు ఇచ్చిన ధైర్యాన్ని కూడగట్టుకుని, నక్కబావతో మాట కలిపి ఇలా అంది. 'నక్కబావా! నన్ను వీలైనంత త్వరగా చంపి నీ ఆకలి తీర్చుకో' అని ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది. దీంతో తాబేలు మాటలకు నక్క ఆశ్చర్యపోయింది. 'ఏంటి నన్ను మోసం చేసి, తప్పించుకుందామని అనుకుంటున్నావా?' అని అడిగింది. అందుకు తాబేలు 'నక్కబావా! నీ తెలివి ముందు నేనెంత, నిన్ను మోసం చేయాల్సిన అవసరం ఏమాత్రమూ నాకు లేదు. పైగా ఎవరు నన్ను వెంటనే చంపుతారా? అని ఎదురుచూస్తున్నాను' అంది.
నక్క అంతుబట్టనట్టుగా చూస్తూ 'చనిపోవడానికి ఎందుకు నీకు అంత ఆరాటం?' అని ప్రశ్నించింది.
'నీ మాటలతో ఆలస్యం చెయ్యకుండా నన్ను త్వరగా చంపి, పుణ్యం కట్టుకో నక్కబావా!' అంది తోడేలు మరోసారి ప్రార్థిస్తున్నట్లుగా.
'నీ వైఖరి వింతగా ఉందే?' అంది నక్క తాబేలును అయోమయంగా చూస్తూ.
'మరేం లేదు నక్కబావా! రాత్రి మా తాతయ్య కలలో కనిపించాడు. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఇలాంటి ఏకాదశి ఏడాదికి ఒకసారే వస్తుందట. ఈ ఘడియల్లో చనిపోతే, నేరుగా స్వర్గానికే చేరుకుంటారట. పైగా అక్కడ అమృతం తాగి, చిరంజీవిగా చావు లేకుండా బతికే అవకాశం దక్కుతుందట' అని బదులిచ్చింది.
'నిజమేనా?' అడిగింది నక్క.
'స్వర్గంలో అమృతం కేవలం కొద్దిగా మాత్రమే ఉందట. ఆ అవకాశం వేరే ఎవరికీ దక్కకుండా నాకే లభించేలా వెంటనే నన్ను చంపి, పుణ్యం కట్టుకో' అంది తాబేలు. ఇది నిజమేనని నమ్మిన నక్క.. తానే స్వర్గానికి వెళ్లే అవకాశాన్ని, అమృతం తాగే అదృష్టాన్ని ఎందుకు దక్కించుకోకూడదు అనుకుంది. ఉదయం నుండి అడవి అంతా తిరిగి తిరిగి, చెమట వాసన వస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు ఓ పది నిమిషాల్లో స్నానం చేసి వచ్చి, నిన్ను చంపి తింటాను' అంది. వెంటనే అక్కడే ఉన్న మడుగులో మునిగి, ఊపిరి పీల్చకుండా ముక్కు మూసుకుంది. కొన్ని నిముషాల్లోనే నక్క ప్రాణాలు వదిలింది. నక్కబావ పీడ వదిలించుకునే ఉపాయం చెప్పినందుకు మనసులోనే కుందేలుకు కృతజ్ఞతలు తెలుపుకుంది తాబేలు. నక్క భయం తొలగిపోయినందుకు మిగతా తాబేళ్లు అన్నీ ఈ తాబేలును ఎంతగానో అభినందించాయి.
రజిత కొండసాని
96528 38920