ప్రజాశక్తి-ఆదోనిరూరల్
అసలు ప్యాకింగ్‌లో ఏ మాత్రం తేడా కనిపించదు. లోతుగా పరిశీలిస్తే తప్ప అది నకిలీ ప్యాకింగ్‌గా గుర్తించలేం. వర్షాకాలం సీజన్ ప్రారంభం కంటే ముందే నకిలీ పత్తి విత్తనాల తయారీకి శ్రీకారం చుడతారు. ఏ మాత్రం తేడా లేకుండా రంగురంగుల బొమ్మలతో ప్యాకింగ్‌లు తయారు చేస్తారు. ఈ విత్తనాల ద్వారా మంచి దిగుబడి వస్తుందని రైతులను బాగా నమ్మిస్తారు. ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మే రైతులు రంగురంగుల ప్యాకింగ్‌లు చూసి మోసపోతున్నారు. వాటిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. తర్వాత అవి నకిలీ విత్తనాలనే విషయాన్ని గ్రహిస్తున్నారు.
ప్రతేడాది ప్రభుత్వం నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా పూర్తి స్థాయిలో మాత్రం బ్రేక్ పడడం లేదు. ప్రతేడాది కోట్లాది రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి రావడం, రైతులు కొనుగోలు చేయడం, మోసపోవడం పరిపాటిగా మారింది. మరో పది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. అప్పుడే నకిలీ విత్తనాలను సరఫరా చేసేందుకు దళారులు సిద్ధమవుతున్నారు. టాస్క్ ఫోర్స్ టీంతోపాటు పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేసి నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేయాల్సి ఉంది.
ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండడంతో నకిలీ విత్తనాల వ్యాపారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. నల్ల, ఎర్ర నేలలతో విస్తరించి ఉండడంతో స్వల్ప, దీర్ఘకాలికమైన పంటల సాగుకు అనువుగా ఉంది. సహజంగా పత్తి 180 రోజుల పంట. ఎర్రనేలల్లో 140 రోజుల వ్యవధిలోనే పంట చేతికొస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది వ్యాపారులు ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. నకిలీ విత్తనాలను కమీషన్ ఏజెంట్ల ద్వారా రైతులకు పంపిణీ చేసే ప్రయత్నం కొనసాగుతున్నట్లు సమాచారం. రూ.500 నుంచి రూ.600 వరకు లభించే 450 గ్రాములు కలిగిన విత్తన ప్యాకెట్‌ను (అప్పు కింద) రూ.800లకు అంటగట్టే దందా సాగుతోంది. పత్తి చేతికొచ్చిన తర్వాత రూ.100కు రూ.25 వడ్డీతో సహా చెల్లించాలనేది ఇందులో ప్రధాన ఒప్పందం. ఆదోని ఏజెన్సీలో రైతుల అమాయకత్వం వ్యాపారులకు ఆదాయ వనరుగా మారింది.
గ్రామాల్లో లూజు పత్తి విత్తనాల వ్యాపారం
వివిధ గ్రామాల్లో లూజు పత్తి విత్తనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. లూజు పత్తి విత్తనాలు రూ.800 ప్రకారం తీసుకొని రైతులు మోసపోతున్నారు. ఎలాంటి ప్యాకింగ్ లేకుండా లూజు పత్తి విత్తనాల వ్యాపారం పలుకుబడి ఉన్నా పెద్ద రైతుతో కొనసాగిస్తున్నారు. చివరకు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులకు ఆత్మహత్యలు తప్పడం లేదు.
పత్తా లేని టాస్క్‌ఫోర్స్
పంటల సాగు విధానంలో వ్యవసాయ శాఖది అత్యంత కీలకమైన పాత్ర. దుకాణాలకు అనుమతులివ్వడం, సరుకుల వివరాలను బోర్డులపై ప్రదర్శించడం, రసీదులు ఇవ్వడం, విత్తనాలను తయారు చేసిన కంపెనీల వివరాలతో పాటు వాటి వాడకానికి ఉన్న గడువు, విత్తనాలు వేస్తే వచ్చే మొలక శాతంలాంటి కీలకమైన అంశాలన్నింటినీ పరిశీలించాల్సింది వ్యవసాయ శాఖనే. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన వ్యవసాయ శాఖ కనీసం మండల, డివిజన్, జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు ప్రాధాన్యత గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ప్యాకింగ్‌ల అడ్డా.. ఆదోని డివిజన్ కేంద్రం
ఆదోని ప్రాంతం మీదుగా నకిలీ విత్తనాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నకిలీ విత్తనాలు ప్యాకింగ్ చేయడంలో ఆదోని కేంద్రంగా మారింది. నకిలీ విత్తనాలను అసలు విత్తనాలుగా ప్యాకింగ్ చేయడంలో వారికి వారే సాటి. ముందుగానే ప్యాకింగ్ చేసి పెట్టుకోవడంతో తనిఖీల్లో కూడా బయటపడని పరిస్థితులు నెలకొన్నాయి. పట్టుబడితే ఏదో ఒక పైరవీ చేసి బయటకు రావచ్చనే ధీమాతో నకిలీ విత్తనాలను తెస్తున్నట్లు సమాచారం.
పత్తి విత్తనాలు కొని మోసపోవద్దు
రైతులు కొనుగోలు చేసిన పత్తి విత్తనాల్లో ఎలాంటి అనుమానాలున్నా పట్టణంలోని మార్కెట్ యార్డులోని డాక్టర్ వైఎస్‌ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లో ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
లూజు పత్తి విత్తనాలపై సమాచారం అందించండి
- ఎఒ పాపిరెడ్డి
గ్రామాల్లో ఎవరైనా లూజు పత్తి విత్తనాలు కానీ, నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతుంటే మాకు సమాచారం అందించాలి. అలాంటి వారి పేర్లను గొప్పగా ఉంచుతాం. సెల్ నెంబర్ ఎడిఎ గిరీష్ 83310 57500, ఎఒ పాపిరెడ్డి 83310 57502 నెంబర్లకు సంప్రదించాలి.
నకిలీ పత్తి విత్తనాలు










