ప్రజాశక్తి-అరకులోయరూరల్:మండలంలోని సుంకరమెట్ట సంతలో నకిలీ వస్తువుల విక్రయాలు అరికట్టాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి పి రామన్న డిమాండ్ చేశారు. ఆదివారం గిరిజన సంఘం ఆధ్వర్యాన సుంకరమెట్ట సంతలో సందర్శించి పలు దుకాణాల వద్ద వస్తువులను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, వారపు సంతల్లో నిత్యావసర వస్తువులైన మంచి నూనె, పప్పు, చేపలు, దినుసులతో గిరిజనులు రోగాల పాలవుతున్నారన్నారు. సంతలో ఇంత మోసం జరుగుతున్నా అధికారులు పర్యటించి ఎందుకు అరికట్ట లేదని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుంకరమెట్ట సంతలో రైతులను దళారులు తీవ్రంగా మోసం చేస్తున్నారని, వారు నిర్ణయించిన ధరకు అమ్మాల్సి వస్తుందన్నారు. దళారుల మోసాలపై సంబంధిత అధికారులు స్పందించి అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు జి.బుజ్జిబాబు, గిరిజన సంఘం మండల నాయకులు పి.నానిబాబు, కె.బుజ్జిబాబు, కృష్ణ అప్పన్న, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.










