నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్సులు రద్దు
ప్రజాశక్తి - చాగలమర్రి
గ్రామాల్లోని వితనాలు విక్రయించే సీడ్స్ దుకాణాదారులు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణాల లైసెన్సులు రద్దు చేయడం జరుగు తుందని కోవెలకుంట్ల వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయశాఖ స్వ్కాడ్ అధికారి క్రిష్ణమోహన్ రెడ్డి, ఏవో రంగనేతాజిలు హెచ్చరించారు. చాగలమర్రి పట్టణంలోని వెంకటసాయి సీడ్స్, శ్రీనిధి, మనగ్రోమోర్ సెంటర్, వీరభద్రసీడ్స్ దుకాణాలను శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయా దుకాణాల్లో రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుకాణాదారులు ఎప్పటికప్పుడు రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. విత్తనాలు విక్రయించే వాటి వివరాలతో రైతులకు రసీదులు ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, తేదీ పూర్తయిన విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే ఆ దుకాణాల లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.










