
నకిలీ విత్తనాలతో నష్టపోయాం
- తలముడిపి గ్రామ పత్తి రైతులు ఆవేదన
- పంట పొలాలను పరిశీలించిన ఎపి రైతు సంఘం బృందం
ప్రజాశక్తి - మిడుతూరు
'నకిలీ పత్తి విత్తనాలతో పూర్తిగా నష్టపోయాం. సర్కార్ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలు నాటి వంద రోజులయినా కాపు లేదు. బోర్ల కింద కూడా ఇదే పరిస్థితి ఉంది' అని మిడుతూరు మండలం తలముడిపి గ్రామానికి చెందిన పత్తి రైతులు ఎపి రైతుసంఘం బృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మిడుతూరు మండలం తలముడిపి గ్రామంలో దెబ్బతిన్న పత్తి పంటలను రైతు సంఘం జిల్లా బృందం పరిశీలించింది. తలముడిపి గ్రామ రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాల్లో సర్కార్ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలు నాటామని తెలిపారు. విత్తనం నాటి సుమారు వంద రోజులు అయిందని, జూలైలో అధిక వర్షాలు, ఆగస్టు వర్షం కురువకపోవడం వల్ల పత్తి పంట బెట్ట తగిలి సరిగా కాపు రాలేదని చెప్పారు. కొంతమంది రైతులు బోర్ల ద్వారా నీళ్లు పెట్టారని, అయినా పత్తి పంట దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటపై ఎకరాకు సుమారు రూ. 50 వేల వరకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, సేద్యపు ఖర్చుల కోసం ఖర్చు చేశామన్నారు. కానీ పంట దిగుబడి ఎకరాకు ఒక క్వింటా కూడా రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. కొంతమంది రైతులు దాదాపు 700 ఎకరాల్లో రోటవేటర్ ద్వారా పత్తి పంటను తీసేసి రబీపంట వేసుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పారు. బోర్ల ద్వారా నీళ్లు కట్టి పంట పండించే కోవచ్చనే ఆశతో ఉన్న రైతాంగానికి అడియాసలయ్యే విధంగా పత్తి పంట పూ, పిందె, కాయ కాపు రావడం లేదని, మొక్కలన్ని ఎర్రబారి పోయి ఎండిపోతున్నాయని చెప్పారు. నకిలీ పత్తి విత్తనాల వల్ల మోసపోయామని ఆవేదన వ్యకం చేశారు. అనంతరం ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రాజశేఖర్ మాట్లాడుఊ వర్షా భావ పరిస్థితులు, నకిలీ విత్తనాలు, చీడపురుగులు, తెగుళ్ల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పత్తి పంట పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించాలని, తీవ్రంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి రాక నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇప్పించాలని, నకిలీ కల్తీ విత్తనాల అమ్మిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి సురేష్, మండల నాయకులు రామకృష్ణ, మద్దిలేటి, శ్రీనివాసులు, రైతులు శేఖర్, నరేష్ పాల్గొన్నారు.