Jun 19,2023 21:34

తహశీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- దేవనకొండ
నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. సోమవారం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వీరశేఖర్‌, అశోక్‌, యూసుఫ్‌ బాష మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ నేపథ్యంలో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని మండలంలో నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోందని తెలిపారు. ఇప్పటికే నకిలీ విత్తనాలు సాగు చేసిన చాలామంది రైతులు నష్టపోయారని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలో ముందస్తుగా బోర్లు, బావులు, చెరువుల కింద, హంద్రీ నీవా కాలువల ద్వారా సాగు చేసుకుంటున్న రైతులు పత్తి విత్తనాలు నాటారని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల వల్ల కొన్ని మొలవక, మరికొన్ని మొలకెత్తిన మొక్కలు మొత్తం ఎర్రబారి ఉపయోగం లేకుండా పోతున్నాయని చెప్పారు. ఈ పత్తి విత్తనాలు అమ్మిన వ్యాపారులపైనా, కంపెనీపైనా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత నష్టం జరిగినా, సాగునీటి సదుపాయం ఉన్నచోట కూడా భారీగా పత్తి విత్తనాల వల్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. వ్యాపారులు ఆడిందే ఆటగా వారి ఆటలు సాగుతున్నాయని తెలిపారు. నకిలీ విత్తనాలతో అధిక మొత్తం లాభాల కోసం రైతులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయో ఎరువుల పేరుతో భారీగా దందా జరుగుతోందని, అనుమతుల్లేకుండా, రైతులను మభ్యపెట్టి జోరుగా బయోమందుల వ్యాపారం చేసుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు నష్టం కలిగించే బయో మందుల వ్యాపారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌బికెల ద్వారా విత్తనాలు, మందులు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మండలంలో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి భూములకు తగ్గట్లు పంటలు వేసుకునేలా రైతులను చైతన్యం చేయాలని తెలిపారు. రైతులు రామాంజనేయులు, రంగడు, మల్లికార్జున పాల్గొన్నారు.