నకిలీ విత్తనాల నియంత్రణకు పటిష్ట చర్యలు
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
- వైఎస్‌ఆర్ పశుభీమా పథకం కింద ఎద్దులకు కూడా ప్రీమియం వర్తింపు
- వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తే సంబంధిత దుకాణాలను సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో 20 మెట్రిక్ టన్నుల ఎరువులు, విత్తనాలు సాగుకు ముందే సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌బికెల్లో రైతులు వేసుకున్న ప్రతి పంటను ఈ క్రాఫ్ బుకింగ్ చేయడంతోపాటు ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించే పంటలపై అవగాహన కల్పించాలన్నారు. పిఎం కిసాన్ కింద పెండింగులో వుండి అర్హత కలిగిన 29,764 మంది రైతుల ఈకేవైసీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచి పంట ఉత్పత్తులపై పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను సూచించారు. పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా వుండాలన్నారు. వైయస్సార్ పశుభీమా పథకం కింద పశువులు, మేకలు గొర్రెలకు బీమా వర్తించే తరహాలోనే ఎద్దులకు కూడా వర్తించే విధంగా వచ్చే నెల నుండి ప్రారంభించనున్నారని తెలిపారు. మొత్తం ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం భరిస్తుండగా 20 శాతం లబ్ధిదారుల వాటాగా ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్లో అన్ని బ్యాంకులు రైతులకు సకాలంలో రుణాలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యనారాయణను సూచించారు. నంద్యాల ప్రాంతంలో 55 నర్సరీలు వున్నాయని, నకిలీ విత్తనాల విక్రయ ప్రక్రియను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారిని సూచించారు. సమావేశంలో మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి.నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి మోహన్ రావు, ఇరిగేషన్, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఎపిఎంఐపి, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.










