నకిలీ సర్టిఫికెట్లతో విఆర్‌ఒ ఉద్యోగం
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ శాఖ
- తలారి చిన్న వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలి : బి.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్
బండి ఆత్మకూరు మండలంలోని కాకునూరు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్‌గా పని చేస్తున్న బి.వెంకటేశ్వర్లు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నాడని అతని సోదరుడు బి.వెంకటేశ్వర్లు ఆరోపించారు. అనేకసార్లు జిల్లా కలెక్టర్, ఆర్‌డిఒ, తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. చివరకు లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేశానన్నారు. గురువారం బండి ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'మండలంలోని ఏ.కోడూరు గ్రామానికి చెందిన తలారి చిన్న వెంకటేశ్వర్లు 1972 నుండి 1975 వరకు ఆ గ్రామ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ నెంబర్ 443, పుట్టిన తేదీ 01-07-1963గా రికార్డులలో నమోదు చేసుకున్నాడు. అనంతరం ఏడవ తరగతి కోసం అడ్మిషన్ 1420 నెంబర్‌తో 1976 నుండి 1977 ఫిబ్రవరి వరకు పాఠశాలకు వచ్చి అనంతరం మధ్యలోనే చదువు మానివేశాడని జిల్లా పరిషత్ హెచ్‌ఎం కె.మాధురి ధ్రువీకరించారు. ఆ తర్వాత తలారి చిన్న వెంకటేశ్వర్లు పదవ తరగతి సర్టిఫికెట్ కోసం బోయ వెంకటేశ్వర్లు సన్నాఫ్ బోయ సోమన్న పేరుతో 06-07-2002 సంవత్సరంలో ప్రగతి మోడల్ హైస్కూల్, శ్రీ రామకృష్ణాపురం హైదరాబాద్‌లో ఉత్తీర్ణత పొందినట్లు రికార్డులు సృష్టించాడు. తలారి చిన్న వెంకటేశ్వర్లుగా ఉన్న ఈయన బోయ వెంకటేశ్వర్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి విఆర్వో ఉద్యోగాన్ని సంపాదించాడు. 10వ తరగతి మార్కుల జాబితాలో ఎలాంటి గుర్తింపు మచ్చలు లేకుండా, మార్కు లిస్టు ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తలారి చిన్న వెంకటేశ్వర్లుతో పాటు విఆర్‌ఒ ఉద్యోగాలుగా పదోన్నతి పొందిన అందరిపై సమగ్ర విచారణ చేపట్టాలని లోకాయుక్తను కోరాం. విఆర్వోగా నా సోదరుడు బోయ వెంకటేశ్వర్లు నా సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడు. ఒకే తల్లికి ఒకే తేదీన ఇద్దరు ఎలా జన్మిస్తారు..? నా సోదరునికి నాకు మూడు సంవత్సరముల కాలవ్యవధి ఉంది. వీటన్నింటీపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి' అని బి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏకంగా వీఆర్వో ఉద్యోగం నకిలీ ధృవీకరణ పత్రాలతో పొందడం, రెవెన్యూ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం పట్ల మండలంలో బహిరంగంగా చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో నిరుద్యోగులకు, విద్యావంతులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలాంటి నకిలీలపై రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.










