
ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లిలో దొంగ నోట్లు చలామణి అవ్వడంతో కలవరం రేపుతుంది. .పెట్రోల్ బంకుల కేంద్రంగా కొందరు వ్యక్తులు నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాని విధంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కోసం వచ్చి రూ.500 దొంగనోట్లు మార్చుతున్నారు. ఒరిజనల్ నోట్లు, దొంగనోట్లకు తేడాను బంకుల్లో పనిచేసే సిబ్బంది గుర్తించలేక పోతున్నారు. రెండు నోట్లు ఒకేలా వున్నాయని వారు చెబుతున్నారు. విధులు ముగించుకుని క్యాష్ కౌంటర్ వద్ద నగదు అప్పగించినప్పుడు దొంగనోట్లు బయట పడుతున్నాయి. దీంతో, తెలియక వాటిని పుచ్చుకున్న బంకు సిబ్బంది లబోదిబో మంటున్నారు. ఆదివారం నక్కపల్లి పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకులో పని చేస్తున్న సిబ్బందికి 500 రూపాయల నకిలీ నోట్లు 6 వచ్చాయి. దీంతో ఈ నష్టాన్ని తాము భరించాలని వారు ఆవేదన చెందుతున్నారు. ఇలా కొన్ని రోజుల నుంచి గుట్టు చప్పుడు గాకుండా నకిలీ కరెన్సీ నోట్లను కొందరు మార్చుతున్నారని తెలిసింది.