ప్రజాశక్తి - చింతలపూడి
నకిలీ పురుగు మందులు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఏపుగా పెరుగుతున్న పంట సైతం ఈ పురుగుమందుల దెబ్బకు నాశనమవుతుంది. 'ఇలాంటి పురుగు మందుల నివారణకు పటిష్ట చర్యలు తీసుకున్నాం. తరచూ తనిఖీలు చేస్తున్నాం..' అంటూ వ్యవసాయాధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పనులకు పొంతన లేకుండా ఉంది. మార్కెట్‌లోకి విచ్చలవిడిగా నకిలీపురుగు మందులు వచ్చేస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు పండించాలంటనే రైతులు సంకోచిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు రెట్టింపు అయ్యి, మరోవైపు దళారుల దెబ్బకు మద్దతు ధర రాక నానాఅవస్థలు పడుతున్నారు. ఈ పురుగు మందులు తమకు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ, మాయమాటలు చెప్పి బలవంతంగా వాటిని అంటగడుతున్నారు. చివరకు నష్టపోయిన తర్వాత రైతులను ఎవరూ కన్నెత్తి చూడటం లేదు.
ముఖ్యంగా చింతలపూడి మండలంలోని యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు యర్రగుంటపల్లిలో ఉన్న పురుగులు మందులు దుకాణం వద్ద మొక్కజొన్న పంట ఎదుగుదలకు పురుగు మందులు కొనుగోలు చేశారు. వాటిని పిచికారీ చేసిన తర్వాత మొక్కజొన్న మువ్వకు ఎర్రగా వచ్చి, మొక్కలు చనిపోయాయని రైతులు తెలిపారు. ముగ్గురు రైతులు మొతం 23 ఎకరాల్లో ఈ మందును పిచికారీ చేశారు. ఈ మొత్తం పంట చనిపోతుందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఎరువుల షాపు యాజమనిని రైతులు నిలదీశారు. పురుగులు మందుల కంపెనీ యజమానితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. పురుగు మందుల కంపెనికీ సంబంధించిన ప్రతినిధులు ఇటీవల పొలంలోకి వెళ్లి పరిశీలించారు. రైతుల అందరి సమక్షంలో ఎకరాకు రూ.60 వేలు ఇస్తామని, అదికూడా రెండు నెలలు తరువాత ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా కంపెనీ ప్రతినిధులు రైతులతో మాట్లాడినట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
శాంపిల్స్ పరీక్షల నిమిత్తం పంపాం
పంట చనిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని మండల వ్యవసాయాధికారి మీనాకుమారి తెలిపారు. ఈ మేరకు శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం గుంటూరు పరిశోధనాలయానికి పంపామని చెప్పారు.










