Jun 14,2023 00:04

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : అనుమతులేమీ లేకుండా రాయచూర్‌ నుండి గుంటూరుకు తెచ్చి నకిలీ పత్తి విత్తనాలను విజిలెన్సు అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌టిసి కార్గో సర్వీసు ద్వారా వచ్చిన ఏడు బస్తాల విత్తనాలను నల్లూరి రాంబాబు అనే వ్యక్తి తెచ్చి విక్రయిస్తుండగా విజిలెన్సు డిఎస్‌పి శ్రీనివాసరావు పర్యవేక్షణంలో అధికారులు గమనించి పరిశీలించగా వీటి నాణ్యత లేదని, నకిలీవని నిర్ధారించారు. రూ.2.38 లక్షల విలువ కలిగిన 40 విత్తనాల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విఆర్‌ఎల్‌ పార్మిల్‌ ఆఫీసులో 200 లీటర్ల అనుమతులు లేని బయో స్టిమ్లెంట్స్‌ అమరావతిలో తయారు చేసినట్లుగా స్టిక్కర్లు అతికించి, పసుపులేటి ఆంజనేయ ప్రసాద్‌ పేరుతో రవాణా చేశారు. ఆ పేరుతో ఏ లైసెన్స్‌ లేకుండా బయో స్టిమ్లెంట్స్‌ను వివిధ మార్గాల ద్వారా తెప్పించి అక్రమ వ్యాపారం చేయుచున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.1.68 లక్షలు ఉంటుందన్నారు. విజిలెన్సు ఎస్‌పి కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖాధికారి వాసంతి, ఇన్‌స్పెక్టర్లు శ్రీహరిరావు, లక్ష్మారెడ్డి, తహశీల్దార్‌ కె.నాగమల్లేశ్వరరావు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.రామచంద్రయ్య పాల్గొన్నారు. అనుమతి లేని కంపెనీల విత్తనాలు కొని మోసపోవద్దని, విత్తనాలు కొనేముందు ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుంటూరు రీజనల్‌ అధికారి కె.ఈశ్వరరావు రైతులకు సూచించారు.