Oct 09,2023 23:21

ఫిర్యాదులు స్వీకరిస్తున్న పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి స్వీకరించారు. వీటిని సకాలంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇదిలా ఉండగా అర్జిదార్లకు పట్టణానికి చెందిన మోటుపల్లి అంజి భోజనాన్ని సమకూర్చగా ఆర్గనైజర్లు బి.వెంకట సత్యనారాయణ, మధుసూదనరావు, చిన్ని వెంకట శ్రీనివాసరావు వడ్డించారు. కార్యక్రమంలో ఎఎస్‌పిలు (అడ్మిన్‌) ఆర్‌.రాఘవేంద్ర, డి.రామచంద్ర రాజు (ఎఆర్‌), ఎస్‌.కె చంద్రశేఖర్‌ (క్రైమ్‌), డీఎస్పీలు కె.వి.మహేష్‌, పి.రాజు, బి.ఆదినారాయణ, యు.రవిచంద్ర పాల్గొన్నారు.
రక్షణ కోసం నవదంపతులు వినతి
తాము దగ్గరి బంధువులమే అయినా వివా హానికి పెద్దలు అంగీకరించలేదని, అందుకే ఇంట్లో నుండి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నామని అమరావతి మండలం అత్తలూ రుకు చెందిన ఏసోబు, ఝాన్సీ చెప్పారు. తమ పెద్దలను ఒప్పించాలని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.
039. నకిలీ పత్రాలతో కొడుకు రుణం
1995లో భరంపేట 33వ వార్డులో 3 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి 1999లో ఇల్లు కట్టుకున్నామని, అయితే తమ ముగ్గురు కుమా రుల్లో రెండో కుమారుడు శ్రీనివా సరావు ఇంటికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో రూ.10 లక్షలు రుణం తీసుకున్డాని, దీంతో ఫైనాన్స్‌ కంపెనీ వారు తమకు ఇళ్లు ఖాలీ చేయాలని నోటీసులు ఇచ్చారని జమ్ముల పున్నయ్య, సీతా రామ్మ దంపతులు వాపోయారు. ఫైనాన్స్‌ వారు తమను బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరారు.
స్థలంపైనా అన్న కన్ను
రైల్వే గేట్‌ మెన్‌గా ఉద్యోగం చేస్తున్న తమ తండ్రి 2009లో అనారోగ్యంతో మృతి చెందగా కారుణ్య నియామకం కింద అన్న అంకమ్మరావు ఉద్యోగం పొందాడని, తన తండ్రికి సంబంధించిన 5 సెంట్ల తాను తీసుకునేలా పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరిందని నరసరావుపేట మండలం కేసనపల్లికి చెందిన మాతంగి మేరిబాబు తెలిపారు. అయితే ఇప్పుడు స్థలంపైనా తన అన్న కన్నేశాడని, దాన్ని తనకు స్వాధీనం చేయకుండా బెదిరిస్తున్నాడని వాపోయారు.
పాస్టర్‌ మోసంపై వికలాంగుని ఫిర్యాదు
ఇల్లు కట్టి, అమెరికాకు చెందిన సంస్థ నుండి రాయితీలు ఇప్పిస్తామని చెప్పి ఏనుగుదిన్నెలపాడుకు చెందిన పాస్టర్‌ పౌలురాజు, అతని బంధువు బాబు తనను మోసం చేశారని ఈపూరు మండలం అగ్నిగుండాలకు చెందిన వికలాంగుడు వినుకొండ నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తన వద్ద వారిద్దరూ రూ.4.50 లక్షలు తీసుకుని మూడేళ్లవుతున్నా ఇంటిని మాత్రం నిర్మించలేదని, వారికి తాను ఇంటి స్థలాన్ని తనఖా పెట్టి రూ.3 వడ్డీకి అప్పు చేసి మరీ డబ్బులు ఇచ్చానని తెలిపారు.
పొలంలో నాగలి దగ్ధమైంది
పొలం పక్కన పొలానికి చెందిన రైతు యామవరపు పుల్లారావు పత్తి కట్టే తగులబెడుతుండగా ఆ మంటలు తన పొలానికి వ్యాపించి రూ.10 వేల నాగలి దగ్ధమైందని, దీనిపై పుల్లారావును ప్రశ్నించగా బెదిరిస్తున్నాడని అచ్చంపేట మండలం కస్తలకు చెందిన ఏసోబు ఫిర్యాదు చేశారు. తాను అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండ్రోజుల పాటు తననే స్టేషన్‌కు పిలిపించారని, పుల్లారావును మాత్రం పలిపించలేదని, తనకు న్యాయం చేయాలని కోరారు.
పొలంలో కక్షపూరితంగా కాల్వ తవ్వకం
తమ పొలంలో కాల్వను అక్రమంగా తవ్వడంతోపాటు పత్తి పంటనూ ధ్వసం చేశారని షేక్‌ సైదా, అబ్బాస్‌ అలీ, షేక్‌ పెద్దసైదాపై రాజుపాలెం మండలం రెడ్డిగూడేనికి చెందిన వికలాంగుడు నిమ్మకాయల మహబూబ్‌ ఫిర్యాదు చేశారు. తన భార్యకు పసుపు కుంకుమ కింద వచ్చిన 74 సెంట్ల పొలం వచ్చిందని, అయితే పొలానికి నీరు సరఫరా అవగానికి ఇప్పటికే కాల్వ ఉన్నా నిందితులు మాత్రం తమపై కక్షతో తమ పొలంలోనే కాల్వ తవ్వారని వాపోయారు.
వాటా డబ్బులు ఇవ్వడం లేదు
తమకు రావాల్సిన డబ్బులను ఇవ్వకుండా పెదకూరపాడుకు చెందిన కాంట్రాక్టర్లు గుండపనేని బాష, దర్శి రవి ఇబ్బంది పెడుతున్నారని కృష్ణమనేని అనంతలక్ష్మి ఫిర్యాదు చేశారు. తన భర్త కృష్ణప్రసాద్‌ ఎనిమిదేళ్ల నుండి కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ సిమెంట్‌ పనులు చేశారని, ఆ పనుల తాలుకు రూ.80 లక్షల ను తన భర్త వాటాగా పెట్టారని, అయితే ఆయన 2021లో మృతి చెందారని తెలిపారు. అనంతరం బిల్లులు మంజూ రవగా వాటిని కాంట్రాక్టర్లే తీసుకుని తన భర్త వాటా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని చెప్పారు. అప్పులు చేసిమరీ తన భర్త డబ్బులిచ్చారని, అప్పులవాళ్ల ఒత్తిళ్లు పెరిగాయని, తమకు డబ్బు ఇప్పించాలని కోరారు.
ఇదిలా ఉండగా ఇంటి నిర్మాణం కోసం రూ.2.50 లక్షలు తీసుకున్న కాంట్రాక్టర్‌ పనులు చేయించకుండా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని నరసరా వుపేటకు చెందిన మహిళ, తన కొడుకు అప్పులు చేసి పారి పోగా ఆ డబ్బులు తనను చెల్లించాలని ఒకరు బెదిరి స్తున్నారని మాచర్లకు చెందిన మరో మహిళ, బీడు భూ మిలో గేదెలను మేపొద్దన్నందుకు దాడి చేశారని క్రోసూరు మండలం విప్పర్లకు చెందిన మరోకరు ఫిర్యాదు చేశారు.