నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్ల ముఠా అరెస్టు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
విలువైన స్థలాలకు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లను సృష్టించి, అమాయకులకు అమ్మి తప్పుడు రిజిస్ట్రేషన్ లను చేయించే ముఠా సభ్యులు చవ్వ పవన్, తిరుమలయ్య, మౌలాలి, ఖాసిం, డాక్యుమెంట్ రైటర్ లు సుమంత్, అస్లామ్, దాదాపీర్, నబీరసూల్ లను పోలీసులు అరెస్టు చేశారు.మరి కొంత మంది ముఠా సభ్యులు పరారీ లో ఉన్నట్లు జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు. ఆదివారం బొమ్మల సత్రం వద్ద ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామ పురం, గ్రామానికి చెందిన సంగా లక్ష్మీకాంత రెడ్డి అన వ్యక్తి నంద్యాల టౌన్ లో నివసించే రౌడీ షీటర్లు అయిన తిరుమలయ్య, రాగినేని సంజీవ, మౌలాలి, ఖాసిం, చవ్వ పవన్, ఆవుల శ్రీనివాసులు లు అను వ్యక్తుల సహకారముతో, నంద్యాల, నూతనముగా జిల్లా అవుతున్నదని 2020 వ సం.లో నంద్యాల టౌన్ లో ఆర్ ఏ ఆర్ ఎస్ కు దగ్గరలో ఉదయానంద హాస్పిటల్ వెనుక వైపున ఉన్న 50 సెంట్ల స్థలమునకు సంబందించిన 3220/1995 డాక్యుమెంట్ ను మహేంద్రకర్ వెంకట లక్ష్మిబాయి పేరు మీద ఉన్నదని తెలుసుకొని సదరు డాక్యుమెంట్ యొక్క సర్టిఫైడ్ కాపీని సంగా లక్ష్మీకాంత రెడ్డి తన అనుచరుడైన రాగినేని సంజీవ ద్వారా నంద్యాల సబ్-రిజిస్ట్రార్ నుండి పొందారన్నారు. ఆ సదరు మహేంద్రకర్ వెంకట లక్ష్మి బాయి 2002 లో చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికేట్ ను సృష్టించి, సదరు 50 సెంట్ల స్థలమునకు వారసురాలుగా, మహేంద్రకర్ వెంకట లక్ష్మి బాయికి కూతురు గా సోడమ్ వెంకట లక్ష్మమ్మ కూతురనీ నకిలీ ఫామిలీ సర్టిఫికేట్ సృష్టించి, ఆమే ద్వారా మొదటగా వారి అనుచరులు చవ్వ పవన్, ఆవుల శ్రీనివాసులు, హుస్సేన్ ల పైన నంద్యాల రిజిస్టర్ ఆఫీసులో 2020 డిసెంబర్ 18 వ తేదీన వారికి అనుకూలముగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ సుమంత్ సహకారంతో తప్పుడు రిజిస్ట్రేషన్ సృష్టించారన్నారు.ఆ తరువాత చవ్వ పవన్, ఆవుల శ్రీనివాసులు లు వారి పేరు మీద ఉన్న ప్లాట్లను నంద్యాల రిజిస్టర్ ఆఫీస్ లో వారికి అనుకూలముగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ దాదాపీర్ సహకారంతో నంద్యాల టౌన్, చాంద్ బాడ కి చెందిన పెరికల కిరణ్ కుమార్ కు 2021 వ సం.లో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారన్నారు.అయితే సదరు 50 సెంట్ల స్థలము లో గతంలో వేయబడిన 62, 63 నంబర్ ప్లాట్లకు అసలు ఓనర్ అయిన రూపనగుడి బాలసుబ్బారెడ్డి అను వ్యక్తి సదరు కిరణ్ కుమార్ కు, సోడమ్ వెంకట లక్ష్మమ్మ కు, డిస్ట్రిక్ట్ ర్జిజిస్ట్రార్ కు లీగల్ నోటీసులు పంపగా సంగా లక్ష్మీకాంత రెడ్డి, తన మోసం బయటపడిందని, తన అనుచరులు చవ్వ పవన్ ఆవుల శ్రీనివాసుల కు సోడమ్ వెంకట లక్ష్మమ్మ ద్వారా చేయించిన రిజిస్టర్ ను నంద్యాల రిజిస్టర్ ఆఫీస్ నందు, జనవరి నెల 2023 వ సం.లో రద్దు చేసుకున్నారన్నారు.తరువాత పెరికల కిరణ్ కుమార్ తను మోసపోయానని తెలుసుకొని తను ఇచ్చిన 18 ½ లక్షలు రూపాయలను తిరిగి ఇవ్వమని చవ్వ పవన్, ఆవుల శ్రీనివాసులను అడుగగా, పెరికల కిరణ్ కుమార్ ను తిరుమలయ్య రాగినేని సంజీవ ల చేత కిరణ్ కుమార్ ను చంపుతామని బెదిరించారని,వారికి బయపడి గత నెల ఏప్రిల్ 24 న నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేయగా,పిర్యాదు మేరకు వారి పైన క్రైమ్.నంబర్ 75/2023 ఎస్ స్సీ, ఎస్టీ కేసు నమోదు అయిందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలు చవ్వ పవన్, తిరుమలయ్య మౌలాలి, ఖాసిం, డాక్యుమెంట్ రైటర్ లు సుమంత్, అస్లామ్, దాదాపీర్, నబీరసూల్ లను దర్యాప్తు అధికారి నంద్యాల ఎస్ డి పి ఓ నంద్యాల టౌన్, రైతునగరం ఏరియా వసంత నగర్ వెంచర్-2 లో ఆదివారం ఉదయము 10.30 గంటలకు అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టయిన వారి వద్ద నుండి కొన్ని డాక్యుమెంట్ పత్రాలు, ప్రభుత్వ అధికారుల కార్యాలయాల నకిలీ సీల్లు, ఒక చెక్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు.ఈ నేరముతో సంబంధం ఉన్న మరి కొంత మంది ముద్దాయిలు పరారీలో ఉన్నారని వారిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో నంద్యాల పట్టణ డిఎస్పి సి. మహేశ్వర్ రెడ్డి,పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.










