Sep 12,2023 01:22

పాడేరులోనకిలీ ధ్రువపత్రాన్ని దగ్ధం చేస్తున్న బాలదేవ్‌

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా అరకువేలి మండలం పెద్దలబుడు గ్రామ పంచాయతీ సచివాలయం-1 పరిధిలో అరకు వేలి టౌన్‌ షిప్‌ కొండవీదిలో నివాసముంటున్న పిట్టల రాంబాబు కాపు బీసీ (డీ) వ్యక్తికి ఇటీవల 29న అరకు వేలి తహసిల్దార్‌ కార్యాలయం నుండి ఎస్టీ భగత కుల ధ్రువీకరణ పత్రం అక్రమంగా పొందారని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి .సత్యనారాయణ తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ మండల నాయకులు చిట్టిబాబుతో కలిసి ఆ కుల ధృవీకరణ ప్రతులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఆదివాసి షెడ్యూల్‌ ప్రాంతంలో వ్యాపారం నిమిత్తం నివాసం ఏర్పాటు చేసుకున్న గిరిజనేతరులు ఆదివాసి హక్కులను, చట్టాలను ధిక్కరించి లాడ్జిలు, పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలు నిర్మాణం చేపట్టడమే కాకుండా నేరుగా నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందడం అత్యంత దుర్మార్గమన్నారు. అరకు వేలి మండలం పెదలబుడు పంచాయితీలో అరకువేలి టౌన్షిప్‌లో గిరిజనేతరులు రెవిన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారన్నారు. పిట్టల రాంబాబు కాపు కులానికి చెందిన గిరిజనేతరుడని, పిట్టల ఇంటి పేరుతో ఆదివాసి భగత తెగలో అరకు వేలి మండలంలో 14 పంచాయితీల పరిధిలో ఎవరు లేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌, వెంకటరావు, చిరు, కొండబాబు, బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌:గిరిజనేతరుడుకి ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ డిమాండ్‌ చేశారు.సోమవారం అరకువేలి మండలంలోని సరభగుడా గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నకిలీ కుల దృవీకరణ పత్రాలు దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బాలదేవ్‌ మాట్లాడుతూ, అరకువేలి టౌన్షిప్‌ లో కొండవీధి లో నివాసం ఉంటున్న గిరిజనేతరుడైన పిట్టల రాంబాబుకు ఎస్టీ భగత కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర విచారణ జరిపితే మరిన్ని నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.ఒడిస్సా రాష్ట్రం నుండి అనేక మంది గిరిజనేతరులు పాడేరు ఐటిడిఏ పరిధిలో నివాసం ఏర్పాటు చేసుకుని ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు పొంది ఆదివాసుల రిజర్వేషన్లు, రాయితీలు, సంక్షేమ పథకాలు పొందుతున్నారని తెలిపారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు కిల్లో జగన్నాథం, కొర్ర మగ్గన్న, పాంగి రాము, గ్రామస్తులు కొర్ర సద్దు, మాదల మొస్య, కిల్లో దొంబు, గోపాల్‌, బురిడీ అర్జున్‌, కోటేశ్వరరావు, కీల్లో ప్రసాద్‌, ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: అరకులోయ మండలంలో రెవెన్యూ శాఖ అధికారులు నకిలీ ఎస్టి కుల దృవీకరణ పత్రాన్ని జారీ చేయడాన్ని నిరసిస్తూ స్థానిక ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో నకిలీ ఎస్టికుల దవపత్రాన్ని దద్దం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాఉపాధ్య క్షులు టి.సూర్యనారాయణ మాట్లాడుతూ, 1/70చట్టానికి విరుద్ధంగా ఆదివాసీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పి.డొంబు, పి.మోహన్‌ దాస్‌, కె.అర్జున్‌, పి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.