Sep 20,2023 21:48

నకిలీ డీఎస్‌పీ అరెస్టు

నకిలీ డీఎస్‌పీ అరెస్టు
- ఉద్యోగాల పేరిట రూ. 30 లక్షలు టోకరా
- రూ. ఏడు లక్షల ఆస్తి పత్రాలు స్వాధీనం
- కేటుగాళ్ల చేతిలో మోసపోవద్దు
- యువతకు డీఎస్‌పీ పిలుపు
ప్రజాశక్తి - గూడూరు : గూడూరు పట్టణ సీఐ హజరత్‌ బాబు నకిలీ డీఎస్పీని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే డీఎస్పీనని ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేస్తున్న మందా నాగరాజు అనే వ్యక్తిని బుధవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. ఆయన అనేక పాత కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ సందర్భంగా డీఎస్‌్‌పి ఎం. సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆరు నెలలుగా రైల్వే డీఎస్పీ అంటూ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలామందిని నాగరాజు నమ్మించాడన్నారు. నిరుద్యోగ బాధితుల నుండి రూ. 30 లక్షలు వసూలు చేశాడన్నారు. ఫేక్‌ నియామక పత్రాలు సష్టించాడన్నారు. డూప్లికేట్‌ ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ సర్టిఫికెట్‌ లు సైతం సష్టించి నిరుద్యోగులను బురిడీ కొట్టించాడని తెలిపారు. వసూలు చేసిన నగదుతో ల్యాప్‌ టాప్‌, వాకీటాకి, యూనిఫాం దుస్తులు కొనుగోలు చేశాడన్నారు. గూడూరులో నాజినీ అనే మహిళ రాజారెడ్డితో సహజీవనం చేస్తూ వేరైన క్రమంలో రాజారెడ్డి వద్ద నుండి నగదు రావాల్సి ఉండగా నాజినీ రైల్వే డీఎస్పీగా పరిచయం చేసుకున్న నాగరాజును కలిసింది. దీంతో నాగరాజు, రాజారెడ్డిని బలవంతంగా కారు ఎక్కించుకుని జనావాసాలు లేని ప్రాంతంలో ఎన్‌ కౌంటర్‌ చేస్తానని బెదిరించి పది రోజులలో పది లక్షల రూపాయలు ఇవ్వాలని సంతకాలు చేయించాడు. రాజారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ డీఎస్పీ బాగోతం బయటపడిందన్నారు. అతని వద్ద నుండి ఏడు లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన స్థల ధవీకరణ పత్రాలు, వాకీ టాకీ, ఐదు స్మార్ట్‌ ఫోన్లు, లాఠీ, ఐడెంటిటీ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. యువత స్వశక్తిని నమ్ముకోవాలని, ఇటువంటి కేటుగాళ్ల చేతుల్లో మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు హజరత్‌ బాబు, రైల్వే సీఐ లక్ష్మణ్‌ రావు, ఏఎస్‌ఐ సీకేఎన్‌. రావు, ఒకటవ పట్టణ ఎస్‌ఐ పవన్‌ పాల్గొన్నారు.