Nov 07,2023 01:21

నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి

మాచర్ల: మాచర్ల నియోజకవర్గంలో విద్యా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడ ఈ ప్రాంతం పట్ల సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వ విప్‌, ఎం.ఎల్‌.ఎ పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలేజీలో సమావేశం జరిగింది. ప్రిన్సిపాల్‌ లక్ష్మీకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వరికపూడిశెల ఎత్తిపోతల పధకం శంఖుస్ధాపనకు ఈ నెలలో రానున్నారని, ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి పిజి సెంటర్‌ సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మాచర్ల నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయం కూడ మంజూ రైనట్లు తెలిపారు. సుమారు రూ 70 కోట్ల వ్యయంతో తాళ్ళపల్లి వద్ద పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కెసిపి జనరల్‌ మేనేజరు రమణ మాట్లాడుతూ కాలేజి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ సలహ మండలి చైర్మన్‌ కుర్రి సాయిమార్కోండారెడ్డి, రిటైర్డు డిప్యూటి డిఇఓ రామక్రిష్టారావు, ఎం.ఇ.ఓ వేముల నాగయ్య, పూర్వ విద్యార్ధులు కేళం ఆదినారాయణ, కోలా ఝాన్సి, పఠాన్‌ గౌస్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. మీరా, బెంజిమెన్‌, తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.