ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు మంత్రి నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి జాడ కనిపించడం లేదని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీ తెర్నేకల్ వెంకప్ప విమర్శించారు. శుక్రవారం హత్తిబెళగల్ గ్రామ రోడ్డు మార్గంలో ఉన్న డిగ్రీ కళాశాల పాత భవనం స్థలాన్ని జనసేన కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకులు, ప్రస్తుత మంత్రి ఏళ్ల తరబడి నియోజకవర్గాన్ని పాలించినా ఆలూరులో డిగ్రీ, ఐటిఐ కళాశాలకు భూములు కేటాయించినా సొంత భవనాల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు సొంత భవనాల్లేక ఆశ్రమ బాలుర పాఠశాలలోని కొన్ని గదుల్లో విద్యార్థులు మగ్గుతున్నారని చెప్పారు. ఉన్న పాఠశాలలను విలీనం చేస్తూ, ఉపాధ్యాయులు లేక చదువుకు దూరమవుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో రోడ్లు లేక, ఆలూరులో డ్రెయినేజీ లేక, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంతమార్కెట్ కాంప్లెక్స్, ఎంపిడిఒ కార్యాలయం ముందున్న కాంప్లెక్స్‌లు ప్రారంభించకుండా కమీషన్ల కోసం రెండేళ్లు నిరుపయోగంగా ఉంచారన్నారు. ఎర్రమట్టి, ఇసుక, కర్ణాటక మద్యంతో పాలకులు అభివృద్ధి చెందుతున్నారు తప్ప నియోజకవర్గంలో ఎక్కడా అభివద్ధి లేదన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో జగన్, నియోజకవర్గంలో మంత్రి జయరామ్‌ను ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు.
పాత డిగ్రీ కళాశాల భవనాన్ని సందర్శిస్తున్న తెర్నేకల్ వెంకప్ప










