ప్రజాశక్తి - పెదకూరపాడు : నియోజకవర్గంలో ఇప్పటివరకు 12076 ఓట్లు తొలగించినట్లు ఓటర్ల నమోదు అధికారి రామచంద్రరావు తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020 జూన్ 1 నుండి ఇప్పటివరకు ఆ ఓట్లు తొలగింపులు జరిగాయన్నారు. తొలగించిన ప్రతి ఓటుపై మరల బిఎల్వోలు పున:పరిశీలన చేస్తారన్నారు. అవసరమైతే సహాయ ఓటర్ నమోదు అధికారులు, ఓటర్ నమోదు అధికారి కూడా పరిశీలనలో పాల్గొంటారని చెప్పారు. టిడిపి మండల అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన టిడిపి సానుభూతిపరులు ఓట్లను లక్ష్యంగా చేసుకొని తొలగించాలంటూ బిఎల్వోలపై వైసిపి నాయకులు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఇటువంటివి జరగకుండా చూడాలని కోరారు. సమావేశంలో ఐదు మండలాల తహశీల్దార్లు, సిపిఎం నాయకులు హనుమంతరావు, సూరిబాబు, టిడిపి నాయకులు రాంగోపాల్రావు, ఎం.సాగర్, ఏడుకొండలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పెదకూరపాడులో తొలగించిన ఓట్ల పరిశీలనలో నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి రామచంద్రరావు, తహశీల్దార్ క్షమారాణి పాల్గొన్నారు.










