Sep 22,2023 00:47

యలమంచిలిలో కబడ్డీ ఆడుతున్న బాలికలు

ప్రజాశక్తి - యలమంచిలి
స్థానిక కొత్తపేట ప్రభుత్వ హైస్కూల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి స్కూలు గేమ్స్‌ గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు బాలికల విభాగంలోని కబడ్డీ పోటీలను ఎంపిపి బోదెపు గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనబరచిన స్త్రీలు దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారని తెలిపారు. అనంతరం బాలికల కబడ్డీ, త్రోబాల్‌ ఆటలను తిలకించారు. ఇక్కడ జరిగిన స్కూలు గేమ్స్‌ తొలిరోజు మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, యలమంచిలి మండలాలకు చెందిన విద్యార్ధినులు పాల్గొన్నట్లు ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ సిహెచ్‌.వెంకటరావు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వైవి.రమణ, షబ్బీర్‌, సురేష్‌, సూర్యప్రభ, శారద, రాజు , వంశీ, మూర్తి పాల్గొన్నారు.
అనకాపల్లి : మండలంలోని కూండ్రం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం నియోజకవర్గ స్థాయి అండర్‌ 14, 17 విభాగాల్లో స్కూల్‌ గేమ్స్‌ను ఎంపిపి గొర్లి సూరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి గేమ్స్‌ వల్ల పిల్లల్లో మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సేనాపతి పెంటారావు, నక్కరాజు ప్రభాకర్‌, ఉపాధ్యాయులు, పిటిలు, విద్యార్థులు పాల్గొన్నారు.