ప్రజాశక్తి-ఆదోనిరూరల్
నియోజకవర్గ సమస్యలపై అటు అధికారులు, ఇటు పాలకులు దృష్టి పెట్టాలని మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ మెంబర్ దిలీప్ ఢోకా తెలిపారు. శనివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జీ నీలకంఠప్ప అధ్యక్షత వహించారు. నియోజకవర్గ సమస్యలపై, మండలాల్లో కరువు స్థితిగతులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో పేదలకు ఇల్లు పంపిణీ, పట్టణంలోని లబ్ధిదారులకు పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని తెలిపారు. గతంలో ఇంటి పట్టా కోసం రూ.2100 డిడిలు చెల్లించినా ఇంతవరకు ఇంటి పట్టా మంజూరు కాలేదని చెప్పారు. మున్సిపాలిటీ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లకు విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నా ఇంతవరకు సొంత ఇంట్లోకి చెరుకోలేని దుస్థితి ఉందని తెలిపారు. త్వరలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఆందోళన చేపడతామని చెప్పారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ రావు, పట్టణ కార్యదర్శి సాయినాథ్, యువజన అధ్యక్షులు దేవిశెట్టి వీరేష్, ఐఎన్‌టియుసి నాయకులు జయరాం, మద్దిలేటి, మాణిక్యరాజు, నిస్సార్ అహ్మద్, రామాంజి, నాగేష్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.