Sep 26,2023 21:07

నాయకులతో మాట్లాడుతున్న ఇఆర్‌ఒ నూకరాజు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : నియోజకవర్గంలో ఆరు పోలింగ్‌ కేంద్రాలను మార్పు చేస్తున్నట్లు ఇఆర్‌ఒ ఎం. నూకరాజు తెలిపారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో నియోజకవర్గ స్ధాయిలో ఎలక్ట్రోల్‌ రిటర్నింగ్‌ అధికారి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో 205 ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలకు గాను 6 కేంద్రాలు మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నెల్లిమర్లలో 1, డెంకాడలో 1, పూసపాటిరేగలో 4 కేంద్రాలు మార్పు చేస్తున్నామన్నారు. టిడిపి నాయకులు ఓటర్ల జాబితా సవరణలో తేడాలు ఉన్నాయని, బిఎల్‌ఒలు ఇంటిట సర్వేకి బిఎల్‌ఎలు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో చేసిన సర్వేకు తేడాలున్నాయని వాటిని సవరించాలని ఇఆర్‌ఒ దృష్టికి తీసుకు వెళ్ళారు. అయితే దీనిపై ఇఆర్‌ఒ స్పందిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని వచ్చే నెల 17న తుది జాబితా ప్రచురణ జరిగిన తర్వాత సవరణలుంటే సరి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎఆర్‌ఒ డి. ధర్మ రాజు, వైసిపి నాయకులు సముద్రపు రామారావు, టిడిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు కంది చంద్ర శేఖర్‌ రావు, టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, డెంకాడ మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పల నారాయణ, పార్ల మెంటు కార్యదర్శి లెంక అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.