ప్రజాశక్తి-ముప్పాళ్ల : గులాబీ రంగు పురుగు ఉధృతిని నియంత్రించకుంటే రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా రాదని పల్నాడు జిల్లా డేటా సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ అన్నారు. మండలంలోని చాగంటివారిపాలెంలోని పత్తి పొలాలను ఆయన బుధవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. పత్తికి నష్టం కలిగించే చీడపీడల్లో గులాబీ పురుగు ప్రధానమైనదని, దీనివల్ల దిగుబడులు తగ్గటంతోపాటు, పంట నాణ్యతా దెబ్బతింటుందని అన్నారు. ఈ పురుగు ఆశించిన పూలు, మొగ్గలు రాలిపోతాయని, పత్తికాయలు ముదరక ముందే పక్వానికి వచ్చి విచ్చుకుంటాయని అన్నారు. కొన్ని జాగ్రత్తల ద్వారా పురుగు ఉధృతిని నివారించొచ్చని చెప్పారు. పురుగును, గుడ్డు దశలను నిర్మూలించేందుకు లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల వేపనూనెను కలిపి పిచికారి చేయాలన్నారు. పురుగు ఉధృతి తగ్గడానికి ప్రోఫినోఫోస్ 50 శాతం ఈసి 400 మిల్లీలీటర్లు లేదా నోవాలురాన్ 5.25 శాతం గల దానితో ఇండాక్సీక్రాప్ 4.5 శాతం గల 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటితో కలిపి ఉదయం గానీ లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలని సూచించారు. పురుగు ఉధృతి తగ్గకుంటే పంట వేసి 100 రోజులు దాటితే లాంబ్డా సైహలోత్రిన్ 5 శాతం ఈసి 400 మిల్లీ లీటర్లను 200 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయాలని, కానీ ఈ సింథటిక్ పైరిత్రాడ్స్‌ను పంట అవసాన దశలో అనగా 100 రోజులు దాటినా తరువాత మాత్రమే పిచికారి చెయ్యాలని వివరించారు. లేకుంటే రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కవ అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏవో అరుణ, అగ్రి అసిస్టెంట్ శైలజ, రైతులు పాల్గొన్నారు.










