ప్రజాశక్తి-వేటపాలెం: నివేశ స్థలాల పంపిణీకి లేఅవుట్ సిద్ధమైంది. లబ్ధిదారుల 20 ఏళ్లనాటి సొంతింటి కల తీరనున్నది. మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీ నాయునిపల్లి రెవెన్యూ గ్రామం లో సర్వే నెంబర్ 75/3లో సుమారు మూడు ఎకరాల్లో లేఅవుట్ సిద్ధం చేస్తున్నారు. ఈ లేఅవుట్ శరవేగంగా సిద్ధం చేయడానికి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి స్థానిక అధికారులను ఆదేశించారు. 2003లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, చీరాల శాసనసభ్యులు కొణిజేటి రోశయ్య ఎస్‌సి లకు, బిసిలకు నివేశ స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రతిపాదన లు తయారు చేశారు. అప్పుడే లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు సైతం పంపిణీ చేశారు. స్థానిక రాజకీయాల మూలంగా కొంతమంది హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడంతో పట్టాలు పొందిన లబ్ధిదారులకు స్థలాలు చూపలేకపోయారు. సుదీర్ఘంగా ఎదురు చూసిన లబ్ధిదారులు నీరసించిపోయారు. ఈ విషయాన్ని దేశాయిపేట మాజీ సర్పంచ్ లేళ్ల శ్రీధర్ ఎమ్మెల్యే బలరాం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి కోర్టు నుంచి క్లియరెన్స్ తీసుకొని నిరుపేదలకు పంపిణీ చేయాలని సంకల్పించారు. స్థానిక అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం తీసుకొని రెవెన్యూ రికార్డుల్లో ఆర్‌ఎస్‌ఆర్‌ను పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ఈ లేఅవుట్‌కు ఆనుకొని వెయ్యి ఇళ్ల నిర్మాణం పేరుతో వెలసిన వివేకానంద కాలనీ సైతం ఉంది. భవిష్యత్‌లో ఈ ప్రదేశం 216 జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో లబ్ధిదారులకు అన్ని మౌలిక సదుపాయాలకు ఎలాంటి లోటు ఉండదు. స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలు మాత్రం సొనకాలువను ఎలా పంపిణీ చేస్తారని అంటుండడం గమనార్హం. ఏది ఏమైనా 107 మంది నిరుపేదలకు సొంతింటి కల నెరవేరనున్న దూరం రోజుల్లోకి రావడం శుభ పరిణామంగా ప్రజలు భావిస్తున్నారు.










