Jun 27,2023 00:37

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-పెందుర్తి : నివాసమున్నచోటే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన పెందుర్తి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్‌ మాట్లాడుతూ, భూ పోరాటం చేసి సర్వే నెంబర్‌ 123లో కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. వారిలో కొంతమందికి పట్టాలు ఇచ్చారని, ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారని వివరించారు. వారందరికీ జగన్మోహన్‌రెడ్డి ఎక్కడో ఇళ్ల పట్టాలిస్తే అక్కడికి వెళ్లి వారు ఏమి చేయగలరని ప్రశ్నించారు. ఇక్కడ పనులు చేసుకుంటున్న వారికి ఎక్కడో పట్టాలివ్వడం సరికాదన్నారు. పేదలు ఉంటున్న ఈ స్థలాన్ని గత, ప్రస్తుత ఎమ్మెల్యేల అనుచరులు కబ్జాచేస్తున్నా అధికారులకు పట్టడంలేదని విమర్శించారు.
సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో వేల ఎకరాలను ప్రజా ప్రతినిధులు కబ్జా చేశారని, దీనిపై తహశీల్దార్‌ కార్యాలయంలో సిపిఎం ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ చేపట్టలేదని విమర్శించారు. పేదలు చిన్న గుడిసె వేసుకుంటే వెంటనే అధికారులు వచ్చి తొలగిస్తున్నారన్నారు. పేదలకు నివాసమున్న చోట ఇళ్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలనాయుడు, ఐద్వా నాయకులు రజిని తదితరులు పాల్గొన్నారు.