ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు డాక్యుమెంట్స్ లేని వారికి జగనన్న భూహక్కు, భూ రక్షా పథకం ద్వారా సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారి ఆర్.కేశవరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నివాసిత కుటుంబాలు తమ ఆస్తిని ఆర్థిక ఆస్తిగా ఉపయోగించుకునేలా యాజమాన్య రికార్డును సిద్ధం చేయటానికి ఈ సర్వే చేపట్టినట్టు వెల్లడించారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు తెలియజేశారు.
గ్రామకంఠాల్లో ఆస్తి హక్కు పత్రాలు ఎలా ఇస్తారు?
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం ద్వారా నివాసాల సమగ్ర రీ సర్వే ను చేపట్టార. అన్ని కుటుంబాలను డ్రోన్ టెక్నాలజీ తో సర్వే చేస్తున్నాం. సర్వే పూర్తయిన తరువాత ప్రజల ఆస్తులు ఆక్రమణదారులు, నివాసిత యజమానులకు యాజమాన్య ధ్రువీకరణాల పత్రాల జారీ చేస్తాం. కనీసం ఒకే స్థలంలో 20 ఏళ్లపైబడి నివశిస్తున్నట్టు ఆధారాలు చూపాలి. పన్నుల చెల్లింపులు, ఆధార్ చిరునామాతో కలిగి ఉండాలి.
ధ్రువీకరణ పత్రాల జారీలో వివాదాలు వస్తే?
స్థానికంగా ప్రభుత్వ స్థలాలు, గ్రామకంఠాల్లో నివాసం ఉంటున్న వారికి సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించే ఉద్దేశంతో ఈ సర్వేను చేపట్టారు. ఈ ధ్రువీకరణ పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. వివాదాలు రాకుండా రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో అందరిని విచారించే నిర్ధారిస్తాం. ఫిర్యాదులు వస్తే విచారిస్తాం.
ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో సర్వే పూర్తయింది.?
మొత్తం 202 గ్రామాలకు గాను నాలుగు గ్రామాల్లో పూర్తిగా జరిగింది. మరో 65 గ్రామాల్లో మ్యాప్స్ సిద్ధం చేశాం. ప్రత్తిపాడు మండలం కొండజాగర్లమూడి, దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం, చింతలపూడి, శృంగారపురం గ్రామాల్లోనే గ్రామ కంఠాల నిర్ధారణ జరిగింది. మరో గ్రామాల్లో వివరాలనమోదు, డ్రోన్ ఫ్లై సర్వే పూర్తయింది.
పారిశుధ్యం నిర్వహణపై పర్యవేక్షణ?
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం నిర్వహణకు పంచాయతీలు అధిక ప్రాధాన్యమివ్వాలి. గ్రామీణ స్వచ్ఛ సంకల్పం ద్వారా పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణకు కార్మికుల నియామకం, వాహనాల ఏర్పాటుకు అవకాశం ఇచ్చాం. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పంచాయతీలను ఆదేశించాం. వర్షాలు నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచించాం.
యూజర్ ఛార్జీల వసూలు చేస్తున్నారా?
గ్రామీణ ప్రాంతాల్లోనూ పచ్చదనం, పరిశ్రుభ్రతను పెంపొందించేందుకు ప్రాధాన్యమివ్వాలని పంచాయతీలకు సూచించార. అన్ని పంచాయతీల్లో రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 యూజర్ ఛార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ స్థానికంగా ఉన్న పరిస్థితుల వల్ల చాలా గ్రామాల్లో యూజర్ ఛార్జీల వసూలు చేయడం లేదు.










