ప్రజాశక్తి - క్రోసూరు : ఆశా వర్కర్లతో వారాంతపు సెలవులూ లేకుండా 24 గంటలూ పని చేయిస్తున్నా కనీస వేతనం మాత్రం అమలు చేయడం లేదని ఆశా వర్కర్స్ యూనియన్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శివకుమారి ఆవేదన వెలిబుచ్చారు. యూనియన్ మండల సమావేశం స్థానిక ఆమంచి విజ్ఞాన కేంద్రంలో జి.సీత అధ్యక్షతన గురువారం నిర్వహించారు. శివకుమారి మాట్లాడుతూ ఎన్సీడీ సర్వేలు, వ్యాక్సిన్ క్యారియర్లను ఆశా వర్కర్లతోనే చేయిస్తున్నారని, వారి జాబ్‌చార్ట్‌లో లేని విధానాలను కొత్తగా తెచ్చి సచివాలయాల్లో సంతకాలు పెట్టాలంటున్నారని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.ఐదు లక్షలివ్వాలని, సగం జీతాన్ని పెన్షన్‌గా ఇవ్వాలని కోరారు. యూనియన్ జిల్లా నాయకులు సిహెచ్.కుమారి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కావాలంటే సంఘటితంగా పోరాడాలన్నారు. ప్రస్తుతం రూ.10 వేల జీతం పోరాటా ఫలితమేనన్నారు. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డి.కోటేశ్వరమ్మ, ఉపాధ్యక్షులుగా ఎస్‌కె మెహరనున్నీశా, దుర్గాబాయి, ప్రధాన కార్యదర్శిగా జి.సీత, సహాయ కార్యదర్శులుగా టి.విజయలక్ష్మి, సిహెచ్ లక్ష్మీ, కోశాధికారిగా ఎం.త్రివేణి ఎన్నికయ్యారు.










