Apr 25,2023 22:01

న్యాయమూర్తుల వీడ్కోలు సభలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా న్యాయవ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని, సుప్రీం కోర్టు వరకూ వివిధ హోదాలలో జిల్లాకు చెందిన వారు ఉండటం ప్రశంసనీయమని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్‌.బి.జి పార్థసారధి పేర్కొన్నారు. గుంటూరు కోర్టుల నుండి బదిలీపై వెళుతున్న పలువురు న్యాయమూర్తులను గుంటూరు బార్‌ అసోసియేషన్‌ మంగళవారం ఘనంగా సత్కరించింది. బార్‌ అధ్యక్షులు కెవికె సురేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి పార్థసారధి మాట్లాడుతూ జిల్లా నుండి విభిన్నమైన కేసులు వస్తుంటాయని, తద్వారా న్యాయవాదులు, న్యాయమూర్తులు కొత్తపాఠాలు నేర్చుకుంటారన్నారు. బదిలీపై వెళుతున్న 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రామ్‌గోపాల్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రెటరీ కె.రత్నకుమార్‌, సబ్‌కోర్టు జడ్జిలు డి.విజయసారధిరాజు, ఎం.వెంకటశేషమ్మ, ఎ.సునీతరాణి మాట్లాడారు. అనంతరం వారిని దుశ్శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బార్‌ ఉపాధ్యక్షులు దాసరి ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎన్‌.వంశీకృష్ణ, షేక్‌.నైనా, జి.విజయరాజకుమార్‌, మహిళా కార్యదర్శి ఎం.స్వాతి, కార్యవర్గ సభ్యులు, యం.ఆదిలక్ష్మి, జి.అనురాధ, పి.రాజేష్‌, ఆర్‌.శ్రీనివాసరావు, జి.శ్రీలక్ష్మి, పర్చూరి నంద, పులివర్తి శ్రీనివాస్‌, సీనియర్‌ న్యాయవాదులు చెరుకూరి సత్యనారాయణ, వై.కోటేశ్వరరావు, జి.శాంతకుమార్‌, అంకినీడు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.