Oct 25,2023 23:57

నిలిచిపోయిన వాహనాలు

ప్రజాశక్తి-తాడేపల్లి : సిఎం ఇంటికి కూతవేటు సమీపంలో బకింగ్‌ హోమ్‌ కాల్వపై 60 ఏళ్ల క్రితం నిర్మించిన సింగిల్‌ లైన్‌ బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. తరచూ గంట నుంచి రెండు గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. బైపాస్‌ రోడ్డులో అపార్టుమెంట్లు, వ్యాపార సంస్థలతోపాటు ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. సింగిల్‌ బ్రిడ్జి కావడంతో ఎదురెదురుగా కార్లు వచ్చినా ఆటోలు వచ్చినా ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. ఎవరికి వారు తప్పు నీదంటే నీదని బ్రిడ్జిపై వాదులాటకు దిగడంతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోతున్నాయి.
తాడేపల్లి పట్టణం నుంచి బైపాస్‌ రోడ్డులో వ్యాపారాలు నిర్వహించుకునే వారు గంటల తరబడి సమయం వృథా కావడంతో వేలకు వేలు అద్దెలు చెల్లించి తాము వ్యాపారాలు నిర్వహించుకోవాలా వద్దా అని ప్రశ్నిస్తున్నారు. బుధవారం రాత్రి 6.30 నుంచి 7.30 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. అప్పటికీ ట్రాఫిక్‌ క్లియర్‌ కాలేదు. ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వినవస్తున్నాయి. బ్రిడ్జికి ఇరువైపులా సిగల్స్‌ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు. పెరిగిన జనాభా రీత్యా డబుల్‌ లైన్‌ బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం పలుమార్లు కోరింది. ఆ మేరకు ఆందోళనలు కూడా నిర్వహించగా నాయకులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం వారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.