దేశంలో చమురు, నిత్యవసర సరుకుల ధరలు ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్నాయి. ఈ ధరాఘాతాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఒకవైపు ఆందోళనలు జరుగుతుంటే మరోవైపు పెట్రోలు, డీజిలు ధరలను ప్రతి రోజూ పెంచుతూ పోవడం మోడీ సర్కార్ బరితెగింపు దోపిడీకి దర్పణం పడుతోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా దేశ ప్రజానీకం ఆరోగ్యపరంగానూ, ఆర్థికపరంగానూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆప్తులను, ఉపాధులను కోల్పోయి కోట్లాది మంది ప్రజల జీవనం అగమ్యగోచరంగా తయారైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సిఐఐ) లాంటి పెట్టుబడిదారుల సమాఖ్యలు సైతం ప్రజల ఆదాయాల పెంపునకు చర్యలు చేపట్టాలని నొక్కి చెబుతుతున్నాయి. దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా అటు ప్రజాందోళనలను కానీ, ఇటు ఆర్థిక సమాఖ్యల సలహాలను కానీ ఆలకించకుండా మోడీ సర్కార్ పెడచెవిన పెడుతోంది.
2014-15లో లీటర్ పెట్రోల్ ధర సగటున సుమారు రూ. 58.91గా ఉండేది. అయితే, ఆ సగటు ధర ఈ ఏడాది జూన్ 15 నాటికి రూ.98.26 కి పెరిగింది. అంటే, ఏడేళ్ల మోడీ పాలనలో ఈ పెరుగుదల 67 శాతం అన్నమాట. డీజిల్ సగటు ధర రూ. 48.26 నుంచి రూ. 91.01కు భారీగా పెరిగింది. ఇది దాదాపు 89 శాతం పెరుగుదల కావడం గమనార్హం. వంట గ్యాస్ ధరలు సైతం ఇదే తరహాలో ఎగబాకాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల పెరగడం వల్లే ధరలు పెంచాల్సి వస్తోందంటూ ఇంధన సంస్థలు వాదిస్తుంటాయి. 2014-15లో సగటున బ్యారెల్‌కు 46.59 డాలర్లుగా ఉన్నది. 2021-22 మే నాటికి బ్యారెల్ క్రూడాయిల్ ధర 66.95 డాలర్లకు పెరిగింది. అంటే ముడి చమురు ధర పెరిగింది 44 శాతమే. దేశంలో కూడా ఆ మేరకే ఇంధన ధరలు పెరిగివుంటే చమురు సంస్థల వాదనతో సమ్మతించవచ్చు. కానీ ముడి చమురు ధరల పెరుగుదలకు రెట్టింపుగా దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ పెరిగిన ధరాఘాతానికి కారణమెవ్వరు? పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఎప్పటికప్పుడు పన్నులను పెంచుకుంటూ పోవడమే అసలు కారణం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా తగ్గిపోయినప్పుడు కూడా ఆ తగ్గుదల ఫలితం ప్రజలకు దక్కనీకుండా అప్పటికప్పుడు పన్నులను సవరించేసి కేంద్ర ప్రభుత్వమే నిలువు దోపిడి చేస్తోంది.
2014-15లో మోడీ అధికార పగ్గాలు చేపట్టినప్పుడు ఎక్సైజ్ వసూళ్లు రూ.99,068 కోట్లు. 2020-21లో గత డిసెంబర్ వరకు అదే ఎక్సైజ్ వసూళ్లు రూ. 2.36 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే ఈ ఏడేళ్లలో ఈ పెరుగుదల 138 శాతం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో ధరల కారణంగా గత ఆరు నెలల్లోనే నిత్యవసరాల సరుకుల ధరలూ సెగలు కక్కుతున్నాయి. వంట నూనెలు, పప్పులు దాదాపు రెట్టింపు అయ్యాయి. మిగిలిన సరుకులూ కనీసం పది, పదిహేను శాతం పెరిగాయి.
దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరగడం కారణంగానే ఎక్సైజ్ రాబడులు పెరిగాయనీ, ఎక్సైజ్ రేటు పెంపు వల్ల కాదని బిజెపి అనుకూలురు చేస్తున్న వాదన పూర్తిగా అసంబద్ధమైనది. 2014-15 మరియు 2019-20 మధ్య పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం కేవలం 29 శాతం పెరగడం గమనించాల్సిన అంశం. ఇక 2020-21 లో మహమ్మారి కారణంగా లాక్‌డౌన్, రైలు సర్వీసులు నిలిపివేత వంటి కారణాలతో వినియోగం వాస్తవానికి తగ్గిపోయింది.
'ధరలు ఇంతలా పెంచేస్తే ఎలా?' అన్న ప్రశ్నకు 'టీకాలు ఊరికే వస్తాయా? రూ.35 వేల కోట్లు వ్యాక్సినేషన్‌కు ఖర్చు చేశాం. భరించక తప్పదు' అని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల నిస్సిగ్గుగా ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ ఖర్చు భారం ఇప్పుడు వచ్చిన సమస్య. ఏడేళ్లుగా పెట్రో ధరలెందుకు పెంచాల్సివచ్చిందన్న ప్రశ్నకు కరోనా సాకు చూపడం సరైన సమాధానం కాదు. పైగా వ్యాక్సిన్ కోసం బడ్జెట్‌లో కేటాయింపు ఇదివరకే జరిగింది. ఆ సందర్భంలో రూ.35 వేల కోట్ల కోసం పెట్రో ధరలు పెంచుతామని ప్రభుత్వం చెప్పలేదు. తాడిచెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం అన్న చందాన కేంద్రం సాకులు చెప్తోంది.
ఏ దేశంలోనైనా పన్నుల విధానం హేతుబద్ధంగా ఉండాలి. సంపన్నులపై అధిక పన్నులేసి సామాన్యుల ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. కానీ మోడీ సర్కార్ దీనికి రివర్స్‌లో కాకులను కొట్టి గద్దలకు వేసే తరహాలో సామాన్యులపై భారాలు వేసి ఆ సొమ్మును పన్ను రాయితీలు, రుణ మాఫీల ద్వారా బడా కార్పొరేట్లకు దోచిపెడుతోంది. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో రూ.6.08 లక్షల కోట్ల మేర రాయితీలు, మినహాయింపులు ఇచ్చినట్లు పార్లమెంటు సాక్షిగానే ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, 2018-19 నుంచి 2020-21 మధ్య కార్పొరేట్ కంపెనీలు, అధిపతులు తీసుకున్న దాదాపు రూ. 5.9 లక్షల కోట్లకు పైగా బ్యాంకు రుణాలను నిరర్థక ఆస్తుల పేరుతో రద్దు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో క్రోనీలకు దోచిపెడుతున్నందునే ప్రజల నడ్డి విరుగుతోంది. బరితెగించి సాగిస్తున్న ఈ దోపిడిని నిలువరించడానికి విశాల ప్రజా ఉద్యమాలే మార్గం.










