ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య, సీఐటీయు కార్యదర్శి మరోబోయిన రాజాలు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సోమవారం తోటపల్లిగూడూరు మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం, సీఐటీయులు సమరభేరి నిర్వహించాయి. ఈ సందర్బంగా వెంకయ్య, రాజాలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలతో ప్రజల జీవనం కష్టతరంగా మారిందని విమర్శించారు. కోటీశ్వరులకు ఊడిగం చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజానీకంతోపాటు వ్యాపార వర్గాలను సైతం సమస్యలతో ముంచెత్తుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటమే ఆయుధంగా ప్రజలు ఉద్యమించాలని వెంకయ్య, రాజాలు పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మతం పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తుందని విమర్శిం చారు. మోడీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల కాలంలో దేశంలో మహిళలపై హత్యలు, హత్యాచారాలు, నిరుద్యోగం, మత ఘర్షణలు విపరీతంగా పెరిగాయని, ప్రజలపై పన్నుల భారాలు అధికంగా వేసిందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధిస్తూ ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపుతుందని వెంకయ్య, రాజాలు అన్నారు. రాష్ట్రంలో నవ రత్నాలు తప్ప మరో రత్నం వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదని విమర్శించారు. అభివద్ధి శూన్యంగా ఉందన్నారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కరెంటు వాడకంలో అధిక (300) యూనిట్ల పేరుతో ముడిపెట్టి నిలిపివేసిన పెన్షన్లు, రేషన్ కార్డులు, అమ్మవడి, వాహన మిత్ర వంటి సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. అధిక ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని వెంకయ్య, రాజాలు కోరారు. యువత కు నిరుద్యోగ భతి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2006 నుండి సిపిఎం పార్టీ పోరాటాల ద్వారా నిరుపేదలు సాధించుకున్న భూమిలో కొంత భాగాన్ని తోటపల్లి గూడూరు బిట్‌బి2 లోని పాపిరెడ్డి పాలెం పంచాయితీ పరిధి సర్వే నంబర్ 497 లో కొంత భూమి అధికారి పార్టీకి చెందిన కొందరు ఆక్రమించి పట్టాలు సష్టించి దౌర్జనంగా ఆక్రమించుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని తెలిపారు. ఆ భూములను నిరుపేదలకు ఇండ్ల ప్లాట్ల కింద పంపిణీ చేయాలని తాసిల్దార్ కు అర్జీ ఇచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతి రేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. దీనికి ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మండల కమిటీ సభ్యులు బండి శౌరి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కాల్తి రెడ్డి రవణమ్మ, ఈపూరు లక్ష్మయ్య సిపిఎం పార్టీ కార్యకర్తలు, రైతులు ,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










