ప్రజాశక్తి - కలెక్టరేట్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పప్పులు, బియ్యం, బెల్లం, గోధుమలు తదితర నిత్యావసర సరుకులపై జిఎస్‌టి వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఐద్వా, విసిసి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పూర్ణా మార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శవంపై జిఎస్‌టి వంటి అంశాలను ప్రతిబింబించేలా కళారూపాలను తయారు చేసి అందరినీ ఆలోచింపజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జగదాంబ జోన్ కార్యదర్శి ఆర్.వరలక్ష్మి మాట్లాడుతూ చిన్నపిల్లలు తాగే పాలు దగ్గర నుంచి ఇంట్లో నిత్యవసర వస్తువులుగా వాడుకునే పిండులు, పప్పులు, ఆఖరికి శవాలపైన కూడా జిఎస్‌టి విధించడం అత్యంత దుర్మార్గమైన చర్యని అన్నారు. బిజెపి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అచ్చేదిన్, దేశం వెలిగిపోతోంది అని నరేంద్ర మోడీ చెబుతున్న మాటలు బూటకమన్నారు.
సంఘం స్థానిక నాయకురాలు కె.వరలక్ష్మి మాట్లాడుతూ ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్యుని నడ్డి విరగ్గొట్టిన ప్రభుత్వం ఈ రకంగా పేద ప్రజల రక్తం పీల్చుకునే చర్యలకు దిగడం అమానుషమని అన్నారు. కార్పొరేట్లకు పన్నుల మినహాయింపుపై మండిపడ్డారు. దేశంలో ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత కటిక పేదలుగా తయారవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ విధానాలు మారకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు విజయ, స్థానిక ఐద్వా కార్యకర్తలు, విసిసి బాలలు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.










