Jul 14,2023 00:23

సమీక్షల్లో మాట్లాడుతున్న పల్నాడు జెసి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : నిత్యావసర సరుకుల ధరలును తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తొలిగా అర్బన్‌ ప్రాంతాల్లో ఈ చర్యలు ఉంటాయని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ చెప్పారు. రైస్‌ మిల్లర్లు, డాల్‌ మిల్లర్లు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ హాలులో గురువారం సమీక్షించారు. ధరల అదుపునకు వ్యాపారులంతా సహకరించాలని కోరారు. మాచర్ల, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ వంటి మున్సిపాలిటీల రైస్‌మిల్లర్లు, దాల్‌ మిల్లర్లు, హోల్‌ సేల్‌ వ్యాపారులు సైతం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువులను మార్కెట్‌ ధరల కంటే తక్కువగా అమ్మాలని, నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యం రూ.49కు, దేశవాళీ కందిపప్పు రూ.135కు, ఆఫ్రికన్‌ వెరైటీ కందిపప్పు రూ.120కు అమ్మాలని ఆదేశించారు. నిబంధనలు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు శుక్రవారం నుంచి చేపడుతున్నట్లు ప్రకటించారు. పలు అంశాలపై జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి పద్మశ్రీ, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి సూర్య ప్రకాష్‌ సూచనలు చేశారు.