Jun 22,2023 23:48

ప్రారంభ సభలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి

ప్రజాశక్తి - ఎఎన్‌యు : జీవితంలో వెలుగు నిండాలంటే ప్రతిఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉండాలని వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఎపిజె.అబ్దుల్‌ కలామ్‌, సత్య నాదెళ్ల వంటి వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని, నచ్చిన రంగాల్లో పట్టుదలతో కృషి చేసి రాణించాలని చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండ్రోజులపాటు నిర్వహించే మెగాజాబ్‌మేళా గురవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి జాబ్‌మేళాను ప్రారంభించి మాట్లాడారు. మేళాలో పాల్గొంటున్న విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఇంటర్వ్యూల్లో ఎదురయ్యే ప్రశ్నలకు బెరుకు, భయం లేకుండా ధైర్యంగా సమాధానాలు చెప్పాలన్నారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అత్యంత ముఖ్యమని, తమ భావాలను ఎదుటి వ్యక్తులకు అర్థవంతంగా చెప్పగలిగే సమర్ధత కలిగి ఉండాలని చెప్పారు. ఎన్ని భాషల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంచుకుంటారో భవిష్యత్తులో అంత ఉన్నత స్థితికి చేరుకుంటారని, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలు నేర్చుకుంటే సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయంగా కూడా ఉద్యోగాల్లో రాణించాలంటే ఈ మూడు భాషలు అవసరమన్నారు. వివిధ రంగాల్లో రూ. 8.5 లక్షల వార్షిక వేతనం వరకు ఉద్యోగ అవకాశాలు రావడం అనేది చాలా సంతోషకర విషయమన్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కాలాన్ని వృథా చేయకుండా ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రతిఒక్కరూ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించాలని సూచించారు. ఇంటర్వ్యూల్లో ఎంపిక కానంతమాత్రాన నిరుత్సాహ పడొద్దని, కాలానుగుణంగా వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వాటికి కావాల్సిన నూతన నైపుణ్యాలను నేర్చుకుని ఫలితాలు సాధించాలని ఉద్బోధించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యురిటీ, రోబోటిక్స్‌, వంటి అధునాతన కోర్సుల ప్రాధాన్యం పెరిగిందన్నారు. వర్సిటీలో ఇంకుబేషన్‌ సెంటర్ల అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుండి రూ.50 లక్షల మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. జీవితంలో స్థిరపడిన, ఉన్నత స్థానాలను అధిరోహించిన వారు తాము చదువుకున్న విద్యాలయాల అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ మాట్లాడారు. రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి.వరప్రసాదమూర్తి, ఓఎస్‌డి ప్రొఫెసర్‌ కె.సునీత, ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.