Oct 09,2021 07:50

  • నేడు చే గువేరా వర్ధంతి

ఆస్తమా వ్యాధిగ్రస్తుడు దేశాధినేతల తల రాతలు మార్చగలడని ఎవరూ ఉహించలేదు. చదువులో, అధ్యయనంలో, క్రీడల్లో, పోరాటంలో ముందుంటూ...అతి పిన్న వయసు లోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవనేత చే. ప్రపంచ నేతల నుండి దేశ దేశాల యువత వరకు ఎందరికో స్ఫూర్తి ప్రదాత చే గువేరా.
                               

                                                           బహుముఖ ప్రజ్ఞాశాలి గువేరా

చే పూర్తి పేరు ఎర్నెస్టో చే గువేరా డి లా సెర్నా. అర్జెంటీనాలో 1928 జూన్‌14న జన్మించాడు. చిన్నప్పటి నుండే ఆస్తమా వ్యాధిగ్రస్తుడు కావడంతో మంచి వాతావరణం కోసం అతని కుటుంబం కోర్టోబాకు నివాసం మారింది. అక్కడ పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సైకాలజీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఇంజనీరింగ్‌తో పాటు తత్వశాస్త్రం పూర్తిచేశాడు. డాక్టర్‌ కోర్సుతో పాటు ఆర్థశాస్త్రం, సామాజిక శాస్త్రాలపై పట్టు సాధించాడు. శారీరక దారుఢ్యం కోసం స్విమ్మింగ్‌, ఫుట్‌బాల్‌, గోల్ఫ్‌,
     షూటింగ్‌, చెస్‌... వంటి ఆటల్లో ఆరితేరాడు. ఇంజనీరింగ్‌ విద్య పూర్తి చేసి, అర్జెంటినా దేశ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం 1950లో 4500 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేశాడు. వైద్య విద్య చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు పాత మోటార్‌ సైకిల్‌పై లాటిన్‌ అమెరికా దేశాల అధ్యయనం కోసం అర్జెంటీనా, చిలీ, పెరూ, ఈక్వెడార్‌, కొలంబియా, వెనిజులా, పనామా, ఫ్లోరిడా వంటి దేశాలు ఎనిమిది నెలల్లో 8000 కి.మీ చుట్టి వచ్చాడు. ఆ అనుభవాలే 'మోటారు సైకిల్‌ డైరీ'. ఈ యాత్రలో పేదరికం, ఆకలి లేని ప్రాంతం లాటిన్‌ అమెరికా దేశాలలో ఆయనకు ఒక్కటీ కనిపించలేదు. తను చదివిన ఇంజనీరింగ్‌, వైద్య విద్యలు పేదరికాన్ని పరిష్కరించలేవని, దీనికి పోరాటమే పరిష్కారమని అర్ధమై లాటిన్‌ అమెరికా దేశాల్లో జరుగుతున్న పోరాటాల్లో భాగమై తన జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చాడు. ఇలా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రపంచం ముందు నిలిచాడు.
 

                                                         పోరాటం నుండి పుట్టినవాడు 'చే'

    రాజకీయమంటే అధికారం కాదని, అది పోరాట కేంద్రమని, పేదరిక విముక్తి అని చే జీవితం నుండి తెలుసుకోవాలి. ఆయన అలానే జీవించాడు. బొలీవియా, గ్వాటిమాలాలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమెరికా సైనిక తిరుగుబాటుతో కూల్చివేస్తే, ఆ పోరాటంలో పాల్గొన్నాడు. అమెరికా ఆ పోరాటాన్ని అణచివేస్తే అక్కడ నుండి తప్పించుకొని మెక్సికో చేరాడు. 1955లో క్యూబా విప్లవ కెరటం ఫైడెల్‌ కాస్ట్రోను తొలిసారి అక్కడే కలుసుకున్నాడు. క్యూబా నియంత బాటిస్టా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాస్ట్రో నాయకత్వంలో ప్రయాణమై గెరిల్లా దళంలో చేరాడు. 80 మందితో గ్రాన్మా పడవలో క్యూబా బయలుదేరిన మధ్యలో భీకర యుద్ధంలో చాలామందిని కోల్పోయారు. 12 మందే మిగిలారు. అయినా నిరాశ చెందకుండా పోరాటం లోకి దూకారు. అందుకే ఆయనను క్యూబా వాసులు ముద్దుగా ''చే'' అని పిలుస్తారు. గెరిల్లా పోరాటంలో ఉన్న ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు వెళ్లిన చే అనతి కాలంలోనే విప్లవ సైన్యపు మొదటి కమాండరుగా ఎదిగాడు. తన గెరిల్లా యుద్ధ వ్యూహాలతో అధికార సైన్యాన్ని హడలెత్తించి, నియంతైన బాటిస్టా ప్రభుత్వంతో పోరాడి మూడేళ్లలో కూల్చేసి, క్యూబాలో విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడితో సంతృప్తి చెందక లాటిన్‌ అమెరికా దేశాలన్నింటినీ పేదరికం, అమెరికా చెర నుండి విముక్తి చేయాలని భావించి 1965 కాంగో విప్లవ పోరాటంలో, బొలీవియాలో జరుగుతున్న విముక్తి పోరాటంలోకి దూకాడు చే. బొలీవియాలో 1967 అక్టోబరు 8వ తేదీన అమెరికా ప్రతీఘాత శక్తులతో జరిగిన పోరాటంలో ఆయన గాయపడ్డాడు. అమెరికా నియంత సైన్యాలు వెంటనే ఆయన్ను పట్టుకుని...స్కూల్లోని చీకటి గదిలో బంధించాయి. మరుసటి రోజు చే (39 ఏళ్లకే)ను హత్య చేసి, అంతిమ సంస్కారాలు ఎక్కడ చేశారో కూడా ప్రజలకు తెలియకుండా 30 సంవత్సరాలు దాచిపెట్టాయి. ఆయనను చంపడానికి వచ్చిన వారిని ''చంపుకోండి పిరికి పందల్లారా... నన్ను భౌతికంగా మాత్రమే మీరు అంతం చేయగలరు...'' అని హెచ్చరించాడు. నేడు అదే నిజమైంది. చే సిద్ధాంతం, పోరాట పటిమ అప్పటికే ప్రపంచాన్ని చుట్టి అమెరికాకు నిద్ర లేకుండా చేసింది. ఇప్పటికీ చేస్తోంది.
 

                                                                  చే అంటే ఎగిసిపడే కెరటం

       ''కెరటం నాకు ఆదర్శం. ఎగిసి పడుతున్నందుకు కాదు. పడినా లేస్తున్నందుకు'' అన్నాడు స్వామి వివేకానంద. ఖచ్చితంగా ఈ మాటలు వర్తించే వ్యక్తి చే గువేరా. చంపేసి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు చంపారు. ఎక్కడ పాతారో కూడా చెప్పకుండా 30 సంవత్సరాలు దాచి పెట్టినా...ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అమెరికా, ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాడు డిగో మారడోనా, వెనిజులా మాజీ అధ్యక్షుడు చావేజ్‌ వంటి ప్రపంచ నేతలంతా మా హీరో, మా స్ఫూర్తి ప్రదాత చే గువేరా అంటూ దోపిడిని ప్రశ్నించి, నిలదీసి, పోరాడారు. వీరి నుంచి వస్తున్న ఒత్తిడి మరియు ప్రపంచ వ్యాప్తంగా ఆయన పట్ల పెరుగుతున్న క్రేజ్‌ చూసి తప్పని పరిస్థితిలో వాస్తవాన్ని బయటపెట్టింది అమెరికా. ఈ రోజు ఆయన హత్యకు కారణమైన దోపిడీ శక్తులే, నిస్సిగ్గుగా ఆయన బొమ్మతో వ్యాపారం చేసుకుని లాభాలు గడిస్తున్నాయి. తనను బ్రిటిష్‌ వారు ఉరి తీస్తున్నప్పుడు ''మీకు బతికి ఉన్న భగత్‌ సింగ్‌ కన్నా చనిపోయిన భగత్‌ సింగే మరింత ప్రమాదకారి'' అని హెచ్చరించాడు భగత్‌సింగ్‌. చే కూడా తనను చంపడానికి వచ్చిన అమెరికా గూఢచారులను అలానే హెచ్చరించారు. పిరికిపందల్లారా, కాల్చుకోండి, భౌతికంగా మాత్రమే నన్ను హతమార్చగలరు. నా ఆశయాన్ని కాదు అంటాడు. చే చనిపోయిన తరువాత దోపిడి శక్తులకు ప్రమాదకారిగానే మారాడు. ఆ స్ఫూర్తితోనే ప్రపంచ హీరో అయ్యాడు. అందుకే నేటి యువతకు చే ఎవరో తెలియకపోయినా నడుపుతున్న బైక్‌ల మీద, వేసుకునే టీ షర్టు మీద, ధరించే టోపీ మీద నిత్యం బతికే ఉన్నాడు. గుబురు గడ్డంతో, చురుకైన చూపులతో, చంద్రబింబం వంటి ముఖంతో ఉన్న చే బొమ్మ నేడు యువతకు ఫ్యాషన్‌. ''మార్క్సిస్టులుగా మేం ప్రపంచ శాంతిని ప్రేమిస్తాం. శాంతియుత సహజీవనాన్ని బలంగా ఆకాంక్షిస్తాం. దోపిడి ఎప్పుడు నశిస్తుందో ఆ రోజునే యుద్ధాలు చచ్చిపోతాయి. అసలు సిసలైన ప్రపంచ శాంతి నెలకొంటుంది'' అని 1964లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చే గువేరా అన్నాడు. ఆ ఫ్యాషన్‌కు, ఈ లక్ష్యం తోడైతే ప్రపంచ దేశాల తలరాతలే మారిపోతాయి.
 

                                                                      స్ఫూర్తి ప్రదాత

     విప్లవ క్యూబా నిర్మాణంలో భాగంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కార్యకర్తల ప్రాధాన్యతను చాలా వివరంగా చెప్పాడు చే. ప్రజలకు, పార్టీకి వారధి వంటివాడు కార్యకర్త. కార్యకర్తగా ప్రజలను సమీకరిస్తూనే ఆ ప్రజల నుండి నాయకులను తయారు చేసేవాడే కార్యకర్త. అంకితభావం, త్యాగం, విశ్వాసం కలిసినవాడు కార్యకర్త అంటూ చివరికి బైక్‌ గేరు లాంటివాడు కార్యకర్త అంటాడు. అందుకే ఆ కార్యకర్తలను కాపాడుకునేందుకు గెరిల్లా యుద్ధ సమయంలో కూడా తను ఆస్తమా వ్యాధిగ్రస్తుడినని తెలిసి మిగిలిన కార్యకర్తలకు మంచి తుపాకులు ఇచ్చి, తను మాత్రం తుప్పుపట్టిన తుపాకులతోనే ఆ యుద్ధంలో పాల్గొని గొప్ప ఆదర్శ నేతగా నిలిచాడు. ఈ పోరాటంలో గాయాలైన శత్రుసైన్యాలకు, లొంగిపోయిన వారికి కూడా వైద్యం చేసిన గొప్ప మానవతావాదిగా నిలిచాడు. ఇండియా అనుసరిస్తోన్న అలీనోద్యమాన్ని కూడా ఐక్యరాజ్యసమితి వేదిక మీద బలపరిచాడు. నేడు దానిని మోడీ ప్రభుత్వం విస్మరిస్తోంది. అమెరికాకు దాసోహమంటూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టింది. దీనిపై పోరాడటమే చే గువేరాకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
 

/ వ్యాసకర్త డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి /

ఎం. సూర్యారావు